సాక్షి, బెంగళూర్ : క్యాబ్ సర్వీసులు తమకు పోటీగా వస్తుండటంతో బెంగళూర్ ఆటోవాలాలు ఓ నిర్ణయానికి వచ్చారు. సరికొత్త యాప్‌తో రంగంలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. ‘బీ-ట్యాగ్’(b-Tag) పేరిట ఓ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. టాక్సీ డ్రైవర్ యూనియన్ అసోషియేషన్‌లు కూడా ఇందుకు మద్ధతు ప్రకటించటం విశేషం.
యాప్ రూపకల్పన సంస్థ బీ-ట్రాన్స్‌పోర్ట్ సోల్యూషన్ చైర్మన్ ఎన్‌ఎల్ బసవరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘12 యూనియన్లకు చెందిన 9 వేల మంది ఆటో డ్రైవర్లు ఇందులో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. సీఐటీయూ మద్ధతు కూడా మాకే ఉంది. త్వరలోనే బీ-ట్యాగ్ యాప్ సర్వీసులను ప్రారంభిస్తాం’’ అని బసవ రాజు పేర్కొన్నారు. క్యాష్ లెస్ పేమెంట్ల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇక కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ... ‘‘ఓలా, ఉబెర్‌లు ప్రయాణికులను తక్కువ ఛార్జీల పేరిట దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఆటోవాలాలపై దారుణంగా పడుతోంది. కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇకపై అలాంటిది కొనసాగకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలో దేశవ్యాప్తంగా ఆటో యూనియన్ల సమావేశం నిర్వహించి ఇతర నగరాల్లో కూడా ఇలా ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ఆలోచన చేస్తాం’’ అని అన్నారు.
కాగా, 2014లోనే ఓలా ఆటో సర్వీసులను బెంగళూర్ నగరంలో ప్రవేశపెట్టగా.. మొన్నీమధ్యే ఉబెర్ కూడా సర్వీసులను ప్రారంభించేసింది.
Comments
Please login to add a commentAdd a comment