vendors
-
అమ్మాజీ... కదిలించావు!
ఒక సిటీలో ఒక మహిళ రోడ్డు పక్కన ఎండలో కూర్చుని బఠాణీలు అమ్ముతోంది. ఈ దృశ్యం పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్ కంట్లో పడింది. ‘ఈ వయసులో ఎండలో కూర్చొని కష్టపడుతోంది’ అని జాలిపడి బేరం ఆడకుండా ఆమె దగ్గర ఉన్న బఠాణీల సంచులను హోల్‌సేల్‌గా కొనేశాడు. ఆమెతో సెల్ఫీ దిగి తన సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘అమ్మాజీకి సహాయపడినందుకు సంతోషంగా ఉంది’ అంటూ రాశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా యూజర్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ‘చాలా మంచి పనిచేశారు’ అని ప్రశంసిస్తే మరో వర్గం మాత్రం ‘చేసిన మంచి పని చెప్పుకోకూడదు. పబ్లిసిటీ ఎందుకు!’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు పవన్ కౌశిక్ ఇలా స్పందించాడు.. ‘నేను చేసింది చాలా చిన్న పని అనే విషయం, ఆ సహాయం వల్ల అమ్మాజీ జీవితం మారదనే విషయం నాకు తెలుసు. అయితే ఈ పని నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ -
చైనాతో దోస్తీ వల్లే ఇలా జరిగింది..
కొలంబో: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తినేందుకు తిండి లేక లంకేయులు పస్తులు ఉండాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో రాజపక్సే ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటుకు దిగారు. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో శ్రీలంకలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ సైతం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా లంక ప్రభుత్వంపై ఆ దేశ వ్యాపారులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం.. చైనాకు అన్నింటినీ అమ్ముతోందని ఆరోపించారు. ప్రతీ దానిని చైనాకు అమ్ముతున్న కారణంగానే శ్రీలంక వద్ద డబ్బు లేదు. ఇది ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే వాటిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రతీ వస్తువు వేరే దేశాల నుంచి కొనడం కష్టంగా మారింది. ఇదే ప్రధాన సమస్య అని పేర్కొన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని, తమ వద్ద నగదు కూడా మిగలడం లేదని అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పండ్ల విక్రయదారుడు ఫరూఖ్ మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం కిలో ఆపిల్స్ రూ. 500 గా ఉంది. ఇప్పడు ఆపిల్స్ ధర రూ. 1000-1500లకు చేరుకుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు అధికార పార్టీకి చెందిన, కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు బారికేడ్లు ధ్వంసం చేసి నిరసనలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #SriLanka: Clashes broke out between protesters and police today in Colombo during protests against Sri Lanka’s worsening financial crisis. Protesters have been expressing discontent with the ruling family for weeks, intensifying in the past few days.https://t.co/tjKYE8p4KC pic.twitter.com/MeuozfruTA — POPULAR FRONT (@PopularFront_) April 5, 2022 ఇది చదవండి: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్ -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
విక్రేతలకు అండగా అమెజాన్ సాథి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ‘సాథి’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విక్రేతలు తమ ఆన్లైన్ వ్యాపార విస్తరణకు కావాల్సిన సలహాలు, సూచనలను విక్రేతల నుంచే స్వీకరించడం దీని ప్రత్యేకత. సాథీస్ (మెంటార్స్) నుంచి ఆన్లైన్ అమ్మకాలు, అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి అమెజాన్ విక్రేతలు ఎవరైనా తెలుసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎనమిది నెలల్లో 41,000 పైచిలుకు విక్రేతలు 50కిపైగా మెంటార్స్‌ను సంప్రదించినట్టు అమెజాన్ మంగళవారం వెల్లడించింది. -
దోపిడీకి గురవుతున్నారు..
సాక్షి, హైదరాబాద్ : రాజేష్ సొంత వాహనం గల ఓ క్యాబ్ డ్రైవర్. హైటెక్ సిటీలోని ప్రముఖ ఐటీ సంస్థకు రవాణా సేవలు అందించాలని భావించాడు. సంస్థ అధికారులను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సంస్థకు సుమారు 200 వాహనాలను అందజేస్తున్న వెండర్స్ వ్యవస్థ ఉంది. ఒక బడా వెండర్ కింద మరో ఇద్దరు సబ్ వెండర్లు ఉన్నారు. చివరకు ఆ సబ్ వెండర్ సహాయంతో డ్యూటీలో చేరాడు. కానీ అతనికి ప్రతినెలా వచ్చే ఆదాయంలో ముగ్గురు వెండర్లకు కమిషన్ చెల్లించగా మిగిలింది కేవలం రూ.25 వేలు, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోలేక, కారు లోన్ కిస్తీ చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ‘ఓలా, ఊబర్ వంటి సంస్థల్లోనే పెద్ద ఎత్తున కమిషన్ తీసుకొని మోసం చేస్తున్నారని ఐటీ సంస్థల్లో చేరితే.. వెండర్స్ వ్యవస్థ మరింత దోచుకుంటోందని రాజేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, వేవ్‌రాక్ వంటి ఐటీ కారిడార్లలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వెండర్స్ వ్యవస్థ కారణంగా తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. క్యాబ్ డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచి వారికి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఓలా,ఉబర్ వంటి సంస్థల్లాగే ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే నెపంతో వెండర్స్ వ్యవస్థీకృతమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ‘బతుకు దెరువు కోసం రూ.లక్షల్లో అప్పు చేసి స్విఫ్ట్ డిజైర్ వంటి సెడాన్ వెహికల్స్ కొనుగోలు చేసిన డ్రైవర్లు వెండర్లకు కమిషన్ చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏ రవాణా చట్టాల్లోనూ లేని ఈ ‘వెండర్స్’ వ్యవస్థ.. డ్రైవర్లను నిలువునా దోచుకుంటుంది’ అని ఆం దోళన వ్యక్తం చేశాడు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ‘ఓలా, ఉబర్‌లో అన్యాయం జరుగుతుందని ఐటీ కంపెనీలకు వస్తే ఇక్కడా అదే పరిస్థితి ఉంది’ అని విస్మయం వ్యక్తం చేశాడాయన. బడా ట్రావెల్స్‌దే గుత్తాధిపత్యం గ్రేటర్‌లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు సుమారు 30 వేల మందికి పైగా క్యాబ్ డ్రైవర్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. రాత్రింబవళ్లు క్యాబ్ డ్రైవర్ల సేవలు కొనసాగుతున్నాయి. కానీ ఈ డ్రైవర్లలో ఏ ఒక్కరు నేరుగా ఆయా కార్పొరేట్ సంస్థలకు అనుసంధానం కాలేదు. కార్పొరేట్ సంస్థలు తమకు చెల్లించే వేతనాలను కూడా స్వయంగా పొందేందుకు అవకాశం లేదు. వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు, వందల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలకు మధ్య కొన్ని బడా ట్రావెల్స్ సంస్థలు మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ బడా ట్రావెల్స్ కింద మరో రెండు స్థాయిల్లో సబ్ వెండర్స్ పాతుకుపోయారు. మొత్తంగా ఒక కార్పొరేట్ సంస్థకు మూడు స్థాయిల్లో ‘వెండర్స్’ వ్యవస్థ వాహనాలను సమకూరుస్తుండగా, అంతిమంగా తమ సొంత వాహనాలతో రవాణా సదుపాయాన్ని అందజేసే క్యాబ్ డ్రైవర్లు మాత్రం కమిషన్ చెల్లింపులతో తీవ్రంగా నష్టపోతున్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి వెండర్ కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేస్తూ.. డ్రైవర్లకు మాత్రం రూ.9 చెల్లిస్తున్నారు. ‘కార్పొరేట్ సంస్థలు ఒక షీట్ (ట్రిప్పునకు) రూ.750 వరకు చెల్లిస్తారు. కానీ మా చేతికి అందేది రూ.450 మాత్రమే. పైగా డీజిల్‌పై 8 శాతం చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం’ అని క్యాబ్ డ్రైవర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాగా పెరిగిన పోటీ ఐటీ కారిడార్లలో ఒకప్పుడు క్యాబ్‌లు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేసేవి. ఇప్పుడు సిటీ బస్సులతో పాటు, మెట్రో అందుబాటులోకి రావడంతో పోటీ పెరిగింది. దీంతో వెండర్స్‌ను డిమాండ్ చేయలేని పరిస్థితి. ఒక్కో కార్పొరేట్ సంస్థకు ఒకప్పుడు వెయ్యికి పైగా వాహనాల అవసరం ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 60 శాతానికి తగ్గింది. దీంతో క్యాబ్ డ్రైవర్ల మధ్య కూడా పోటీ పెరిగింది. ‘మంత్లీ ప్యాకేజీపై నడిచే పెద్ద వాహనాలు ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు కార్పొరేట్ సంస్థలు ప్రతినెలా రూ.45 వేల వరకు చెల్లిస్తే వెండర్లు ఇచ్చేది మాత్రం రూ.35 వేలే. ఈ వ్యవస్థలోంచి బయటకు రాలేక, తగిన ఉపాధి పొందలేక కొట్టుమిట్టాడుతున్నాం’ అని ఆవేదన చెందాడు రాజశేఖర్. వెండర్ వ్యవస్థను రద్దు చేయాలి ఏ మోటారు వాహన చట్టంలోనూ లేని ఈ వెండర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసంఘటిత రంగంలోని క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేసేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకోవాలి. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు గతంలో ఈ దోపిడీ లేదు మొదట్లో వెండర్ వ్యవస్థ లేదు. కార్పొరేట్ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకొనేవి. కానీ కొన్ని ట్రావెల్స్ సంస్థల గుత్తాధిపత్యంతో ఇది మొదలైంది. – అశోక్‌గౌడ్, క్యాబ్ డ్రైవర్ తీవ్రంగా నష్టపోతున్నాం అప్పు చేసి బండి కొంటే నెలనెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం. ఒక అప్పు తీర్చేందుకు మరోచోట అప్పు చేయాల్సి వస్తుంది. వెండర్స్ వ్యవస్థ లేకుండా చేస్తేనే డ్రైవర్లకు మేలు జరుగుతుంది. – రాజశేఖర్, క్యాబ్ డ్రైవర్ -
క్యాబ్‌కు వెం‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: ‘చిన్న కార్యాలయం.. కొన్ని మాటలు’ ఇవే వారికి పెట్టుబడి. లాభాలు మాత్రం భారీగా తెచ్చే వ్యవస్థ గ్రేటర్ మరొకటి పుట్టుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు నిలువునా మునిగిపోయి అప్పుల పాలవుతున్నారు. గ్రేటర్లో ఉన్న పలు సాఫ్ట్వేర్ సంస్థలు, బీపీఓ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తరలించేందుకు క్యాబ్‌లను వినియోగించడం పరిపాటి. దీన్నే కొందరు తమకు ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. వారే ‘వెండర్లు’. వీరు వివిధ సాఫ్ట్వేర్ సంస్థలతో లాబీయింగ్ ఒప్పందం చేసుకుని.. ఆపై క్యాబ్ డ్రైవర్లతో మరో ఒప్పందం చేసుకుని ఆపై దోపిడీకి తెరతీస్తున్నారు. క్యాబ్‌ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచేసి డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే ఈ రతహా వ్యవస్థీకృత దోపిడీ కొనసాగుతోంది. ఫైనాన్షియర్ల నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన క్యాబ్ డ్రైవర్లు చివరకు అప్పులు చెల్లించలేక వాహనాలను తనఖా పెట్టేసి రోడ్డుపాలవుతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థలకు, కంపెనీలకు, వివిధ రకాల పరిశ్రమలకు అద్దె ప్రాతిపదికన వాహనాలను ఏర్పాటు చేసే నెపంతో డ్రైవర్లకు, సాఫ్ట్వేర్ సంస్థలకు నడుమ మధ్యవర్తిగా వ్యవహరించే ఈ ‘వెండర్’ వ్యవస్థ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సంస్థలు చెల్లించే సొమ్ములో సగానికి సగం తమ ఖాతాల్లో వేసుకొంటున్నట్లు వాపోతున్నారు. డ్రైవర్‌కు దక్కేది కొంతే.. సాఫ్ట్వేర్ సంస్థలు పెద్ద వాహనాలకు కిలోమీటర్‌కు రూ.18 నుంచి రూ.20 చొప్పున చెల్లిస్తుంటాయి. ఆ మొత్తంలో డ్రైవర్లకు రూ.10 నుంచిరూ.12 మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును వెండర్లు తీసుకుంటున్నారు. చిన్న వాహనాల పైన వచ్చే ఆదాయం మరింత దారుణంగా ఉంది. పైగా ప్రధాన వెండర్లకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య సబ్ వెండర్ల వ్యవస్థ కూడా ఉంటుంది. ఒక క్యాబ్ డ్రైవర్ ఏదో ఒక సంస్థలో వాహనం నడపాలంటే సబ్ వెండర్ల వద్ద ఒప్పందం కుదుర్చుకోవాలి. వారు ప్రధాన వెండర్‌తో మరో ఒప్పందం చేసుకుంటారు. ప్రధాన వెండర్‌కు, సాఫ్ట్వేర్ సంస్థలకు మధ్య మరో ఒప్పందం ఉంటుంది. అంతిమంగా సదరు సంస్థకు ప్రయాణ సదుపాయాన్ని అందజేసే సగటు డ్రైవర్‌కు దక్కేది మాత్రం చాలా తక్కువ. గ్రేటర్లో సుమారు 50 వేల మంది సొంత వాహనం కలిగి ఉన్న డ్రైవర్లు ఈ తరహా దోపిడీకి గురవుతున్నట్లు క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిరుజీవుల ఉపాధిపై వేటు.. నగర శివార్లలోని ఇబ్రహీంపట్నానికి చెందిన రవికుమార్ ఏడేళ్ల క్రితం అప్పుచేసి స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నాడు. హైటెక్‌సిటీలోని ఓ సబ్ వెండర్ వద్ద ఒప్పందంచేసుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీసులకు తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడం అతని విధి. ఈ క్రమంలో పనిగంటలతో నిమిత్తం లేకుండా సేవలు అందజేస్తూనే ఉంటాడు. ఆ వాహనంపైన వెండర్‌కు ఒక కిలోమీటర్‌కు రూ.12 చొప్పున లభిస్తే రవి చేతికి వచ్చేది రూ.7 మాత్రమే.‘రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు తిరుగుతాం. కానీ వెండర్స్ మాత్రం 35 నుంచి 40 కిలోమీటర్లకే లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తారు.పైగా ఏ నెలకు ఆ నెల చెల్లించడం లేదు. మూడు నెలలకు ఒకసారి ఇస్తారు. దీంతో నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నాను’ అంటూ రవి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రైవేట్ రంగంలోని వాహనాల నిర్వహణపై రవాణాశాఖకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం ఈ తరహా మధ్యవర్తుల వ్యవస్థ అక్రమార్జనకు అవకాశం ఇచ్చినట్టయింది. కాల్‌సెంటర్లు, సాఫ్ట్వేర్ సంస్థలు, ఫైవ్‌స్టార్, త్రీస్టార్ హోటళ్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాహనాలను ఏర్పాటు చేసే వెండర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఉబర్, ఓలా వంటి అంతర్జాతీయ సంస్థల తరహాలోనే డ్రైవర్లను దోచుకుంటున్నారు. దీంతో చాలామంది డ్రైవర్లు అప్పులు చెల్లించలేక వాహనాలను వదిలేసుకుంటున్నారు. డీజిల్‌పై 4 శాతం అ‘ధన’ం.. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు నేరుగా బంకుల నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు వీల్లేదు. వెండర్లకు అనుబంధంగా పనిచేసే సబ్వెండర్ల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలి. ఇలా కొనే డీజిల్‌పైన పెట్రోల్ ధర కంటే 4 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు.‘ఏ నెలకు ఆ నెల డబ్బులు చేతికి రావు. మొదట్లో 45 రోజులకు ఒకసారి ఇస్తామంటారు. చివరకు మూడు నుంచి 5 నెలల వరకు వాయిదాలు వేస్తారు. వాహనం నడిపేందుకు, ఇల్లు గడిచేందుకు ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తోంది. ఏదో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సొంతంగా వాహనం నడిపేందుకు అవకాశం ఉన్నా ఈ వెండర్లు అడ్డుకుంటారు. చాలా కష్టంగా ఉంది’ డ్రైవర్ నాగరాజు ఆవేదన ఇది. నగరంలో సుమారు 2 లక్షల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో లక్షకు పైగా ఉబర్, ఓలా సంస్థల్లో తిరుగుతుండగా మరో 10 వేల వాహనాలు ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 వేల నుంచి 60 వేల వాహనాలు ప్రైవేట్ సంస్థలకు సేవలందజేస్తున్నాయి. ఈ వాహనాలన్నీ వెండర్ల ద్వారానే సదరు సంస్థలకు సేవలు అందజేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వెండర్ల వ్యవస్థను తొలగించాలి క్యాబ్‌లకు, ప్రైవేట్ సంస్థలకు నడుమ ఉన్న వెండర్లను తొలగించాలి. ప్రభుత్వమే స్వయంగా చార్జీలు నిర్ణయించాలి. డ్రైవర్లు నేరుగా ఒప్పందం చేసుకొనే అవకాశం కల్పించాలి. పైగా వెండర్ల వల్ల ఎలాంటి ప్రమాద బీమా కూడా లేదు.– సిద్ధార్థగౌడ్,జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు -
‘సంక్షిప్త’ ఆయుధం!
నేరాల నిరోధం దిశగా మరో అడుగు పోలీసు గ్రూప్ ఎస్ఎంఎస్లో చేరండి వ్యాపారులు, ప్రజలకు సీపీ పిలుపు మహానగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట నేరాలు...ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. నష్టం కలిగాక మేల్కోవడం కంటే... నిరోధించేందుకు యత్నిస్తే... మన పోలీసు ఉన్నతాధికారులు సరిగ్గా ఇదే యోచనతో ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు ‘పోలీసు గ్రూప్ ఎస్ఎంఎస్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా నేరగాళ్ల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నేరస్తుల అగడాలపై ఎప్పటికప్పుడు అన్ని వర్గాల వారిని అప్రమత్తం చేసేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘పోలీసులు గ్రూప్ ఎస్ఎమ్ఎస్’ పథకానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. చోరీ జరిగాక కేసు నమోదు చేయడం.. ఆ తరువాత దర్యాప్తు చేయడం ఒక ఎత్తయితే అసలు నేరాలు జరగకుండా ముందే జాగ్రత్త పడేందుకు ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేసేందుకు నగర పోలీసులు సరికొత్త ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు ఏదైనా షాపింగ్ సెంటర్లో నేరం జరిగితే నగరంలోని అన్ని షాపింగ్ సెంటర్లను, పోలీసులను ఎస్సెమ్మెస్ ద్వారా అప్రమత్తం చేస్తారు. తద్వారా నిందితులను గుర్తించి, పట్టుకోవడం సులభతరం అవుతుంది. ఒక్కో ఠాణాలో 5 నుంచి 10 వేల వరకు... ఒక్కో ఠాణా పరిధిలో ఐదు వేల నుంచి పదివేల మంది (వ్యాపారులు, ప్రజలు) పోలీసు ఎస్ఎమ్ఎస్ గ్రూప్‌లో చేరాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హోటళ్లు, నగల దుకాణాలు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులు, ఏటీఎం సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, మైత్రి కమిటీ మెంబర్స్, మసీద్, దేవాలయం, చర్చి కమిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాధారణ ప్రజానీకం... ఇలా 31 గ్రూప్‌లను గుర్తించారు. వారి సెల్ నంబర్లు సేకరించి పోలీసు గ్రూప్ ఎస్ఎమ్ఎస్లో చేరుస్తారు. ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్‌ను గుర్తిస్తారు. వెంటనే పోలీసులు సంబంధిత గ్రూప్‌నకు ఎస్ఎమ్ఎస్ పంపి అలెర్ట్ చేస్తారు. ఉదాహరణకు ఏదైనా హోటల్లో ఒకరకమైన చోరీ జరిగితే ఆ విషయాన్ని మిగతా హోటల్స్ వారికి వెంటనే తెలియజేస్తారు. సాధారణ ప్రజలు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సెల్ నంబర్‌ను గ్రూప్ ఎస్ఎమ్ఎస్లో నమోదు చేయించుకోవాలని పోలీసుల సూచిస్తున్నారు. అలా నమోదు చేసుకున్న సెల్‌నంబర్‌కు పోలీసులను నుంచి ఎప్పటికప్పుడు నేరాలు జరుగుతున్న తీరుపై అలెర్ట్ ఎస్ఎమ్ఎస్లు వస్తుంటాయి. ఒకేసారి నగరంలోని ఆరు లక్షల మందికి ఎస్ఎమ్ఎస్ పంపే సౌకర్యం ఉంది. నగరంలోని 70 ఠాణాలకు ఈ సౌకర్యం కల్పించారు. ఎస్ఎమ్ఎస్లకు అయ్యే ఖర్చును కేంద్ర ఐటీ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫోమ్యాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) భరిస్తుంది. వీరు అన్ని ప్రభుత్వ శాఖలకు ఎస్ఎమ్ఎస్లను ఉచితంగా ఉపయోగించుకునే సౌకర్యం కల్పించారు. ఇదే తరహాలో నగర పోలీసు శాఖకు కూడా ఉచితంగా ఎస్ఎమ్ఎస్ చేసుకునే సౌక ర్యం ఉంది.