కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్‌! | Karnataka: Muslim Vendors Banned At Karnataka Temple Fairs | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో మరొకటి.. ఆలయాలు, జాతరల్లో అమ్మకాలపై అభ్యంతరాలు

Published Wed, Mar 23 2022 7:20 PM | Last Updated on Wed, Mar 23 2022 7:38 PM

Karnataka: Muslim Vendors Banned At Karnataka Temple Fairs - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలో మరో డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్‌ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్‌ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్‌ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. 

ఒత్తిడి వల్లే
ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్  ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్‌లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్‌ పేర్కొన్నాడు.

హిందూ సంఘాల డిమాండ్‌ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ శెట్టి స్పష్టం చేశారు.  ఎండోమెంట్‌ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. 

హిజాబ్‌ తీర్పు ఎఫెక్ట్‌!

హిజాబ్‌ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్‌ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో..  చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

వీధుల్లోనూ అభ్యంతరాలు
దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement