సాక్షి, బెంగళూరు: ఈ మధ్యే వచ్చిన తెలుగు సినిమాలో ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల్లో ఏమేమి చేయొచ్చో.. హీరో వివరంగా చెబితే ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొట్టారు. కానీ బయట రాజకీయ పరిస్థితి మాత్రం కాస్త విభిన్నంగా ఉంది. పొత్తులతో అధికార పీఠం చేజిక్కించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తొలినాళ్లలోనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి అర్థమయిందో ఏమోగానీ.. ఆయన ప్రస్తుతం గుళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
మే 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడి(ఎస్) అధినేత కుమారస్వామి అనుకున్నవి ఏమి జరగటంలేదని కొంత నిరుత్సాహపడ్డారు. కానీ స్వతహగా దైవభక్తి కలిగి ఉండటంతో దేవుడిపైనే భారం వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వరుసగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. సీఎంవో ప్రకారం ఆదివారం వరకు కుమారస్వామి అధికారికంగా 34 దేవాలయాలను దర్శించుకున్నారు. ఇక, సోమవారం హర్దనహళ్లిలో శివాలయంతోపాటు మరో నాలుగు దేవాలయాలను దర్శించుకున్నారు. అంతేకాక హసన్ జిల్లాలోని మరో పుణ్యక్షేత్రాన్ని దేవగౌడ తనయుడు కుటుంబ సమేతంగా దర్శించకున్నారు.
కుమారస్వామి గుడిబాటపై మిశ్రమ స్పందన లభిస్తోంది. దేవాలయాల సందర్శనలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కుమారస్వామి మించిపోయారని రాజకీయ విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. కానీ దేవగౌడ కుటుంబం దైవాన్ని, జాతకాలను ఎక్కువగా నమ్ముతుందని, అందుకే దేవాలయాలకు వెళ్తుంటారని, ఇందులో మరో ఉద్దేశం లేదని సీఎం సన్నిహితులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment