
లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్‌డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్‌బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది.
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment