
కేవలం ఒక భాషను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోం..
బెంగళూరు: ఒకవైపు హిందీ దివస్ దినోత్సవాన్ని(సెప్టెంబర్ 14న) దేశవ్యాప్తంగా బీజేపీ ఘనంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో.. వ్యతిరేకత కూడా చాలాచోట్ల వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో హిందీ దివస్‌కు వ్యతిరేకంగా జేడీఎస్(జనతాదల్ సెక్యులర్) ఆందోళన చేపట్టింది.
ఈ సందర్భంగా.. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తారు. ‘‘హిందీని బలవంతంగా రుద్దితే చూస్తూ ఊరుకోం. భారతీయులను విడదీయాలని బీజేపీ చూస్తోంది. కేవలం ఒక భాషను ప్రచారం చేయడం వల్ల దేశ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంద’’ని ఆయన విమర్శించారు.
ఇదిలా ఉంటే.. ప్రజల సొమ్ముతో ఇలాంటి వేడుకలు నిర్వహించకూడదంటూ సీఎం బసవరాజ్ బొమ్మైకి కుమారస్వామి ఇదివరకే ఓ లేఖరాశారు. బలవంతంగా హిందీ భాషా దినోత్సవం వేడుకలు జరపడం కన్నడ ప్రజలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కన్నడ భాష ప్రాధాన్యత గురించి రాష్ట్రంలో జోరుగా చర్చ కూడా నడిచింది. అయినప్పటికీ.. కర్ణాటకలో హిందీ దివస్ వేడుకలు జరుగుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: ‘బీజేపీది అశాంతివాదం’