సాక్షి, హైదరాబాద్ : రాజేష్ సొంత వాహనం గల ఓ క్యాబ్ డ్రైవర్. హైటెక్ సిటీలోని ప్రముఖ ఐటీ సంస్థకు రవాణా సేవలు అందించాలని భావించాడు. సంస్థ అధికారులను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సంస్థకు సుమారు 200 వాహనాలను అందజేస్తున్న వెండర్స్ వ్యవస్థ ఉంది. ఒక బడా వెండర్ కింద మరో ఇద్దరు సబ్ వెండర్లు ఉన్నారు. చివరకు ఆ సబ్ వెండర్ సహాయంతో డ్యూటీలో చేరాడు. కానీ అతనికి ప్రతినెలా వచ్చే ఆదాయంలో ముగ్గురు వెండర్లకు కమిషన్ చెల్లించగా మిగిలింది కేవలం రూ.25 వేలు, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోలేక, కారు లోన్ కిస్తీ చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ‘ఓలా, ఊబర్ వంటి సంస్థల్లోనే పెద్ద ఎత్తున కమిషన్ తీసుకొని మోసం చేస్తున్నారని ఐటీ సంస్థల్లో చేరితే.. వెండర్స్ వ్యవస్థ మరింత దోచుకుంటోందని రాజేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, వేవ్‌రాక్ వంటి ఐటీ కారిడార్లలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వెండర్స్ వ్యవస్థ కారణంగా తీవ్ర దోపిడీకి గురవుతున్నారు.
క్యాబ్ డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచి వారికి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఓలా,ఉబర్ వంటి సంస్థల్లాగే ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే నెపంతో వెండర్స్ వ్యవస్థీకృతమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ‘బతుకు దెరువు కోసం రూ.లక్షల్లో అప్పు చేసి స్విఫ్ట్ డిజైర్ వంటి సెడాన్ వెహికల్స్ కొనుగోలు చేసిన డ్రైవర్లు వెండర్లకు కమిషన్ చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏ రవాణా చట్టాల్లోనూ లేని ఈ ‘వెండర్స్’ వ్యవస్థ.. డ్రైవర్లను నిలువునా దోచుకుంటుంది’ అని ఆం దోళన వ్యక్తం చేశాడు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ‘ఓలా, ఉబర్‌లో అన్యాయం జరుగుతుందని ఐటీ కంపెనీలకు వస్తే ఇక్కడా అదే పరిస్థితి ఉంది’ అని విస్మయం వ్యక్తం చేశాడాయన.
బడా ట్రావెల్స్‌దే గుత్తాధిపత్యం
గ్రేటర్‌లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు సుమారు 30 వేల మందికి పైగా క్యాబ్ డ్రైవర్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. రాత్రింబవళ్లు క్యాబ్ డ్రైవర్ల సేవలు కొనసాగుతున్నాయి. కానీ ఈ డ్రైవర్లలో ఏ ఒక్కరు నేరుగా ఆయా కార్పొరేట్ సంస్థలకు అనుసంధానం కాలేదు. కార్పొరేట్ సంస్థలు తమకు చెల్లించే వేతనాలను కూడా స్వయంగా పొందేందుకు అవకాశం లేదు. వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు, వందల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలకు మధ్య కొన్ని బడా ట్రావెల్స్ సంస్థలు మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఈ బడా ట్రావెల్స్ కింద మరో రెండు స్థాయిల్లో సబ్ వెండర్స్ పాతుకుపోయారు. మొత్తంగా ఒక కార్పొరేట్ సంస్థకు మూడు స్థాయిల్లో ‘వెండర్స్’ వ్యవస్థ వాహనాలను సమకూరుస్తుండగా, అంతిమంగా తమ సొంత వాహనాలతో రవాణా సదుపాయాన్ని అందజేసే క్యాబ్ డ్రైవర్లు మాత్రం కమిషన్ చెల్లింపులతో తీవ్రంగా నష్టపోతున్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి వెండర్ కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేస్తూ.. డ్రైవర్లకు మాత్రం రూ.9 చెల్లిస్తున్నారు. ‘కార్పొరేట్ సంస్థలు ఒక షీట్ (ట్రిప్పునకు) రూ.750 వరకు చెల్లిస్తారు. కానీ మా చేతికి అందేది రూ.450 మాత్రమే. పైగా డీజిల్‌పై 8 శాతం చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం’ అని క్యాబ్ డ్రైవర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాగా పెరిగిన పోటీ
ఐటీ కారిడార్లలో ఒకప్పుడు క్యాబ్‌లు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేసేవి. ఇప్పుడు సిటీ బస్సులతో పాటు, మెట్రో అందుబాటులోకి రావడంతో పోటీ పెరిగింది. దీంతో వెండర్స్‌ను డిమాండ్ చేయలేని పరిస్థితి. ఒక్కో కార్పొరేట్ సంస్థకు ఒకప్పుడు వెయ్యికి పైగా వాహనాల అవసరం ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 60 శాతానికి తగ్గింది. దీంతో క్యాబ్ డ్రైవర్ల మధ్య కూడా పోటీ పెరిగింది. ‘మంత్లీ ప్యాకేజీపై నడిచే పెద్ద వాహనాలు ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు కార్పొరేట్ సంస్థలు ప్రతినెలా రూ.45 వేల వరకు చెల్లిస్తే వెండర్లు ఇచ్చేది మాత్రం రూ.35 వేలే. ఈ వ్యవస్థలోంచి బయటకు రాలేక, తగిన ఉపాధి పొందలేక కొట్టుమిట్టాడుతున్నాం’ అని ఆవేదన చెందాడు రాజశేఖర్.
వెండర్ వ్యవస్థను రద్దు చేయాలి
ఏ మోటారు వాహన చట్టంలోనూ లేని ఈ వెండర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసంఘటిత రంగంలోని క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేసేందుకు రవాణాశాఖ చర్యలు
తీసుకోవాలి. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు
గతంలో ఈ దోపిడీ లేదు
మొదట్లో వెండర్ వ్యవస్థ లేదు. కార్పొరేట్ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకొనేవి. కానీ కొన్ని ట్రావెల్స్ సంస్థల గుత్తాధిపత్యంతో ఇది మొదలైంది. – అశోక్‌గౌడ్, క్యాబ్ డ్రైవర్
తీవ్రంగా నష్టపోతున్నాం
అప్పు చేసి బండి కొంటే నెలనెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం. ఒక అప్పు తీర్చేందుకు మరోచోట అప్పు చేయాల్సి వస్తుంది. వెండర్స్ వ్యవస్థ లేకుండా చేస్తేనే డ్రైవర్లకు మేలు జరుగుతుంది. – రాజశేఖర్, క్యాబ్ డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment