సాక్షి, సిటీబ్యూరో: రాత్రి 11 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ నుంచి ఎల్బీనగర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాడు. వీరి వాహనం నాంపల్లి దాటిన తర్వాత డ్రైవర్ నిద్రలోకి జారుతుండటం గుర్తించిన ప్రయాణికులు నిలదీశాడు. ‘ఉదయం నుంచి అన్నీ లాంగ్ బుకింగ్సే సార్.. రెస్ట్ లేదు’ అంటూ సమాధానమిచ్చాడు డ్రైవర్.
జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళ్లడానికి మరో వ్యక్తి యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయిన సమయంలో ఓ డ్రైవర్ పేరు, ఫొటో కనిపించాయి. తీరా క్యాబ్ వచ్చిన తర్వాత చూస్తే డ్రైవింగ్ సీట్‌లో వేరే వ్యక్తి ఉన్నాడు. అదేమంటూ ప్రయాణికుడు ప్రశ్నిస్తే... ‘క్యాబ్ మా సార్‌ది. నేనూ డ్రైవింగ్ చేస్తుంటా’ అని అన్నాడు.
నగరంలోని అనేక మంది క్యాబ్ వినియోగదారులకు ఈ అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటు ఎవరికి ఫిర్యాదు చేయాలే తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరు వదిలేస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. జరగరానిది ఏదైనా జరిగితే తప్ప ఈ అంశాలపై ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టే పరిస్థితులు కనిపించట్లేదు.
భద్రమనే ఉద్దేశంతోనే వాటి వైపు...
రాజధానిలో క్యాబ్‌ల సంఖ్య లక్ష వరకు ఉంటుంది. ఆటోలు వీటికంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. క్యాబ్ ఎక్కాలంటే కచ్చితంగా యాప్ ద్వారానో, ఫోన్ వినియోగించో బుక్ చేసుకోవడంతో పాటు అది వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అయినప్పటికీ ప్రస్తుతం నగరవాసులు పెద్ద సంఖ్యలోనే క్యాబ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండటం, ఎక్స్‌ట్రా డిమాండ్స్ లేకపోవడంతో పాటు భద్రమనే ఉద్దేశమే దీనికి కారణం. అయితే అత్యంత కీలకమైన ఈ భద్రత కోణాన్నే క్యాబ్ నిర్వహణ సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరోక్షంగా టార్గెట్లు ఇస్తూ సమయపాలన పట్టించుకోకపోవడంతో పాటు క్యాబ్‌లను ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే అంశమూ నిర్వాహకులకు పట్టట్లేదు. ఇదే భవిష్యత్తులో విపరీత పరిణామాలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పని వేళల అమలు ఆమడ దూరం...
కిరాయికి సంచరించే క్యాబ్‌లు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే క్యాబ్ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో క్యాబ్ డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
అలసట తీరేందుకు ఆగుదామన్నా...
ఇలా నిత్యం ఉరుకులు–పరుగులు పెట్టే డ్రైవర్లు అప్పుడప్పుడు కాస్త అలసట తీర్చుకుందామని భావించినా ఇబ్బందే వస్తోంది. ఇలాంటి డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్ చేసుకుని సేదతీరేందుకు అవసరమైన స్థలాలు అన్ని చోట్లా అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా ఎక్కువ శాతం రోడ్ల పక్కనే ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులో ఇతర వాహనచోదకులో వచ్చినప్పుడల్లా తమ వాహనాలను పక్కకు తీయాల్సి ఉండటంతో సరైన విశ్రాంతి లభించట్లేదు. ఇలా ఆపడం అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదహేతువుగా మారుతోంది. ఈ సమస్య తీరాలంటే క్యాబ్స్ డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
పేరొకరిది... వచ్చేది ఇంకొకరు...
క్యాబ్ నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, ఫొటో, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో క్యాబ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉండే... డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే పర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో క్యాబ్ నిర్వాహకులు ‘బ్లాక్’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం క్యాబ్ నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment