ఆప్స్... మేడిన్ ఇండియా! | 'Made in India' section for India App store | Sakshi
Sakshi News home page

ఆప్స్... మేడిన్ ఇండియా!

Published Wed, Nov 19 2014 12:24 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

ఆప్స్... మేడిన్ ఇండియా! - Sakshi

ఆప్స్... మేడిన్ ఇండియా!

స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాక పనులు ఎంత సులువయ్యాయో!
ఫిట్‌నెస్ చెక్ చేసుకునేందుకో ఆప్...
ఆఫీసు పనుల కోసం మరోటి..
మూవీలు, బస్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు మరికొన్ని...
ఇలా ఎన్ని రకాల అప్లికేషన్‌లో. మరి....
వీటిల్లో మేడిన్ ఇండియా ఆప్స్ ఏవో మీకు తెలుసా?
బోలెడన్ని ఉండే ఉంటాయిగానీ..
వాటిల్లో కొన్ని బెస్ట్ ఏవో చూసేద్దాం...

 
హైక్ మెసెంజర్
ఇది వాట్సప్ మాదిరిగా మెసెంజర్ అప్లికేషనే. ఎస్‌ఎంఎస్, ఇన్‌స్టంట్ మెసేజింగ్‌లు కలిసి ఉంటాయి దీంట్లో. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు కూడా ఉపయోగపడటం దీని ప్రత్యేకత. పీడీఎఫ్ ఫైళ్లతోపాటు వర్డ్‌డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో ఫైళ్లు అన్నింటినీ ఈ అప్లికేషన్ ద్వారా పంపుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈమెయిల్ అవసరం లేకుండా పోతుంది. వంద మెగాబైట్ల సైజున్న ఫైళ్లను కూడా సులువుగా షేర్ చేసుకునేలా ఏర్పాట్లున్నాయి. అంతేకాదు. మీరు వైఫై ద్వారా పంపే సమాచారం భద్రంగా ఉండేలా చూసేందుకు 128 బిట్ ఎస్‌ఎస్‌ఎల్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తారు. భారతీ ఎయిర్‌టెల్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల ‘భారతీ సాఫ్ట్‌బ్యాంక్’ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సూపర్‌హిట్. గూగుల్ ప్లే స్టోర్‌లో చూస్తే దాదాపు 9.5 లక్షల డౌన్‌లోడ్‌లున్నట్లు తెలుస్తుంది.
 
కెమెరా ప్లస్
ఇది ఓ ఫొటో ఎడిటింగ్ అప్లికేషన్. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాకపోతే దీనికో ప్రత్యేకత ఉంది. ఫొటోను మీకు కావాల్సిన రెజల్యూషన్‌లో తీసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా రెజల్యూషన్ 8 మెగాపిక్సెల్స్ ఉన్నప్పటికీ అవసరమనుకుంటే మీరు 2 ఎంపీ రెజల్యూషన్‌తోనే ఫొటో తీయవచ్చు. వాల్యూమ్ బటన్స్‌ను ఉపయోగించుకుని రెజల్యూషన్‌లో మార్పులు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎక్స్‌పోజర్‌తోపాటు అనేక ఇతర కంట్రోల్స్ అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తే మీరు తీసే ఫొటోలపై పదాలను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ధర దాదాపు రూ.120.
 
రియల్ క్రికెట్ -14
క్రికెట్ అంటే మన దేశంలో ఎంత అభిమానమో మనకు తెలియంది కాదు. నౌటిలస్ మొబైల్ అనే సంస్థ ఈ క్రేజ్‌ను మొబైల్‌ఫోన్లలోకి తీసుకువచ్చింది రియల్ క్రికెట్ 14 అప్లికేషన్ ద్వారా. బంతి బౌల్ చేసేటప్పుడు దాని వెనుక దాగి ఉన్న భౌతికశాస్త్ర సూత్రాలను విడమరచడంతోపాటు దాదాపు 27 రకాల షాట్లకు సంబంధించిన వివరణలు ఉన్నాయి దీంట్లో. టీమ్ సెలెక్షన్‌తోపాటు ఫీల్డ్ ప్లేస్‌మెంట్ వరకూ అన్నీ సులువుగా నియంత్రించవచ్చునని, ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి దాదాపు 15 ఆప్షన్లు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు 16 దేశాలకు చెందిన 8 మాస్టర్ జట్లు ఉంటాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆర్ట్‌వర్క్‌తో వచ్చే క్రికెట్ గేమ్ అనుభూతిని మిగులుస్తుందని అంటోంది కంపెనీ.
 
సెన్‌ఈజీ
ఈ సైన్‌ఈజీ అప్లికేషన్ వ్యాపారులకు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు భలే ఉపయోగపడుతుంది. మీరు ప్రపంచంలో ఏ మూలనున్నా మీ ఆఫీస్ దస్తావేజులపై ఈ అప్లికేషన్ ద్వారా సంతకం పెట్టవచ్చునంటే మీ పని సులువైనట్లే కదా...! ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి వాటి ద్వారా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం... సంతకం పెట్టాల్సిన చోట స్క్రీన్‌పైనే సంతకం పెట్టేయడం సాధ్యమవుతుంది ఈ అప్లికేషన్‌తో. వర్డ్ డాక్యుమెంట్‌తోపాటు పీడీఎఫ్, జెపీఈజీ, హెట్‌టీఎంఎల్, పీఎన్‌జీ, టీఐఎఫ్‌ఎఫ్ వంటి అనేక ఫార్మాట్ల డాక్యుమెంట్లను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 60 వేల మంది ఈ అప్లికేషన్‌ను డబ్బుకట్టి మరీ ఉపయోగించుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి సునీల్ పాత్రో దీన్ని అభివృద్ధి చేశారు.
 
ఫ్లిక్ టెన్నిస్
ఆపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం రోలోక్యూల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. స్టోరీ, ఎగ్జిబిషన్, హెడ్ టు హెట్ అనే మూడు రకాలుగా టెన్నిస్ గేమ్ ఆడవచ్చు. స్టోరీ పద్ధతిలోనైతే చిన్నపాటి డ్రామా ఉంటుంది. మీరు ఊహాజనిత పాత్రను పోషిస్తూ... ఆ కథకు తగ్గట్టుగా టెన్నిస్ నేర్చుకుంటరు. లక్ష్యాన్ని సాధిస్తారు. డబుల్స్, సింగిల్స్ విభాగాలుంటాయి. ప్రాక్టీస్ కోర్టులు మొదలుకొని స్టేడియమ్‌ల వరకూ దాదాపు 11 రకాల కోర్టులను ఎంచుకోవచ్చు.
 
డెక్

ఆఫీసు ఉద్యోగుల ఉత్పాదకత పెంచే అప్లికేసన్ ఇది. టాబ్లెట్ల ద్వారా ప్రెజెంటేషన్లు తయారు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఐఐఎం బెంగళూరు విద్యార్థి సుమంత్ రాఘవేంద్ర అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ రెండేళ్ల క్రితమే క్వాల్‌కమ్ క్యూప్రైజ్ అవార్డును సంపాదించింది. గ్రాఫిక్స్‌పాటు టైపోగ్రఫీ, యానిమేషన్ వంటి ప్రెజెంటేషన్ సంబంధిత కార్యకలాపాలన్నీ చాలా సులువుగా చేసుకునే వీలుకల్పించే ఈ అప్లికేషన్‌ను ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement