స్టీల్‌ప్లాంట్ స్టీల్ మెల్ట్‌షాప్-1లో మూడో కన్వర్టర్ సోమవారం తెల్లవారుజామున మరమ్మతులకు గురవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
- ఎస్‌ఎంఎస్‌లో కన్వర్టర్ మరమ్మతులే కారణం
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ స్టీల్ మెల్ట్‌షాప్-1లో మూడో కన్వర్టర్ సోమవారం తెల్లవారుజామున మరమ్మతులకు గురవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మూడో కన్వర్టర్‌లో ద్రవ ఉక్కు సిద్ధమైన తరువాత కన్వర్టర్ కిందభాగాన రంధ్రం ఏర్పడడాన్ని విభాగం ఉద్యోగులు గమనించారు. వెంటనే అందులో ఉన్న మెటల్‌ను ట్యాప్ చేశారు. ఎన్నడూ లేనవిధంగా కన్వర్టర్ లోపల లైనింగ్ బాగుండి, కింద భాగానికి రంధ్రం ఏర్పడడం గమనించి అధికారులు ఆశ్చర్యపోయారు.
ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు విభాగానికి చేరుకొని కన్వర్టర్‌ను పరిశీలించారు. తరువాత కన్వర్టర్ కింది భాగానికి మరమ్మతులు చేసి తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. కొన్ని హీట్ల అనంతరం క్యాంపెయన్ రిపేర్ పనులు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. మరమ్మతులు జరిగి కన్వర్టర్ ఉత్పత్తి ప్రక్రియలోకి రావడానికి సుమారు పదిరోజులు పట్టవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ కన్వర్టర్ల సమస్య వల్ల సుమారు 16 హీట్లు నష్టపోయినట్టు సమాచారం.
ఇదే సమయంలో మొదటి కన్వర్టర్ పైభాగం వద్ద రంధ్రం పడడంతో కన్వర్టర్-2 ద్వారా మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. స్టీల్ సిటు నాయకులు ఎన్.రామారావు, జె.అయోధ్యరాం, బి.అప్పారావు తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు సిద్ధమైన సమయంలో ఎస్‌ఎంస్ కన్వర్టర్లు సక్రమంగా ఉండేలా విభాగం అధికారులు బాధ్యత తీసుకోవాలని స్టీల్ ఏఐటీయూసీ కార్యదర్శి కె.ఎస్.ఎన్.రావు డిమాండ్ చేశారు.