సార్వత్రిక ఎన్నికల ముందు హల్‘సెల్’ చేసిన సర్వే మెసేజ్‌లు.. ఎన్నికల పూర్తయ్యాకరెట్టింపయ్యాయి. ఎన్నికల ముందు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పేరున వచ్చిన ఎగ్జిట్‌పోల్, సర్వేలు.. ఎన్నికలు పూర్తయ్యాక మరింత జోరందుకున్నాయి.
అమలాపురం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ముందు హల్‘సెల్’ చేసిన సర్వే మెసేజ్‌లు.. ఎన్నికల పూర్తయ్యాకరెట్టింపయ్యాయి. ఎన్నికల ముందు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పేరున వచ్చిన ఎగ్జిట్‌పోల్, సర్వేలు.. ఎన్నికలు పూర్తయ్యాక మరింత జోరందుకున్నాయి. అరా, నీల్సన్, ఆజ్‌తక్, ఎన్డీ టీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ వంటి ప్రఖ్యాత మీడియా సంస్థలతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్, గవర్నర్, లగడపాటి సర్వేలు, ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ అంటూ సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు వరదలా వస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని ఎంపీలు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు వస్తాయంటూ ఎస్‌ఎంఎస్‌లు వెల్లువెత్తుతున్నాయి.
పోలింగ్ రోజున ఉదయం 9, ఉదయం 11, మధ్యాహ్నం ఒంటి గంట, మధ్యాహ్నం 3, సాయంత్రం ఐదు గంటలకు జరిగిన పోలింగ్ ఆధారంగా సర్వే ఫలితాలంటూ ఎస్‌ఎంఎస్‌లు వచ్చిపడ్డాయి. తాజాగా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సర్వే అంటూ జిల్లాల వారీగా ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుందనే సమాచారంతోఎస్‌ఎంఎస్‌లు పోటెత్తుతున్నాయి. ఎన్నికల ముందు మీడియా, ఇంటెలిజెన్స్ సర్వేలంటూ పార్టీల నాయకులే ఈ ఎస్‌ఎంఎస్‌లు పంపి ఓటర్లను తమ పార్టీ వైపు లాక్కునేందుకు ఇటువంటి పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా పాత లెక్కలతోనే కొత్తగా సర్వేలు వస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు.
ఒక్కొక్క ఎస్‌ఎంఎస్.. ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సర్వేలను వారి పార్టీ నాయకులు, అభిమానులకు పంపుతూ సంతోషిస్తుంటే, తమకు అనుకూలంగా రాని వాటిని చెరిపేస్తున్నారు. సెల్‌ఫోన్లలో వాటి దూకుడు చూస్తుంటే ఒకటి, రెండు రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, ఎంత మెజారిటీ వస్తుందో కూడా ఎస్‌ఎంఎస్‌లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
అలాగే సోషల్ వెబ్‌సైట్లలో కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ జిల్లాకు ఎన్ని, ప్రభుత్వం ఫలానా పార్టీ ఏర్పాటు చేస్తుందనే సర్వేల పేరుతో ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీల గెలుపోటములు, ఆధిక్యం, సాధించే స్థానాలపై లక్షల్లో పందాలు వేసిన పందెంరాయుళ్లు గంటకో పార్టీకి అనుకూలంగా వస్తున్న సర్వేలు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. సర్వేల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.