రాష్ట్రంతో పాటు నగరంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. నగరంలో బుక్ చేసిన మూడు వారాలకు కానీ సిలిండర్ అందడం లేదు.
= సిలిండర్ సరఫరా చేశామంటూ ఎస్‌ఎంఎస్‌లు
= అదిగో ఇదిగో అంటూ ఊరడింపులు
= పక్షం రోజులు గడచినాఅందని సిలిండర్
= చమురు కంపెనీలదే జాప్యమంటున్న డిస్ట్రిబ్యూటర్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంతో పాటు నగరంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. నగరంలో బుక్ చేసిన మూడు వారాలకు కానీ సిలిండర్ అందడం లేదు. బుకింగ్, సరఫరాకు సంబంధించి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వినియోగదారులకు సమాచారం అందుతోంది. ‘మీకు సిలిండర్‌ను సరఫరా చేశాం’ అని ఎస్‌ఎంఎస్ వ చ్చి 15 రోజులు గడుస్తున్నా వినియోగదారులకు అందడం లేదు. దీనిపై ఏజెన్సీల్లో ఫోన్ ద్వారా వాకబు చేస్తే ‘ఇదిగో పంపుతున్నాం’ అని సమాధానమైతే వస్తుంది కానీ సిలిండర్ ఆచూకీ మాత్రం లేదు.
దాదాపు నెల రోజులుగా చమురు కంపెనీలు సిలిండర్ల సరఫరాలో చాలా జాప్యం చేస్తున్నాయి. దీని వల్లే బుక్ చేసిన 20 నుంచి 25 రోజులకు కానీ వినియోగదారులకు అందడం లేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీనికి తోడు నగదు బదిలీకి సంబంధించి చమురు కంపెనీలు డేటాను అప్‌డేట్ చేసే క్రమంలో ఈ నెలలో డీలర్లు కొద్ది రోజుల పాటు కార్యకలాపాలను ఆపేశారు. కొన్ని చమురు కంపెనీలు మాత్రం సిలిండర్ల సరఫరాలో జాప్యం జరగడం లేదని చెబుతున్నాయి. శీతాకాలం, కస్టమర్ల సంఖ్య పెరిగినందున ‘వేచి ఉండాల్సిన కాలం’ పది రోజులకు పెరిగిందని తెలిపాయి. చమురు కంపెనీలకు రాష్ట్రంలో 90 లక్షల మంది కస్టమర్లు ఉండగా, ఒక్క బెంగళూరులోనే 30 లక్షల మంది ఉన్నారు.