
ఎస్‌ఎంఎస్ చార్జీలతో ఖాతాదారులపై భారం మోపుతున్న బ్యాంకులు
సాక్షి, కోల్‌కతా : బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఖాతాదారులకు పంపే ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకూ వినియోగదారులపై బ్యాంకులు చార్జీల భారం మోపుతున్నాయి. ఎస్‌ఎంఎస్‌లపై వాస్తవ యూసేజ్ ప్రకారం చార్జీలు విధించాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరితే..బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్ చార్జీల పేరిట ఖాతాదారులను బాదేస్తున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పెద్దగా లావాదేవీలు నిర్వహించని ఖాతాలపై ఎస్‌ఎంఎస్ చార్జీల వడ్డింపు ఉండదు. అయితే ఫిక్స్‌డ్ చార్జీల పేరిట బ్యాంకులు మూడు నెలలకు ఓసారి ఈ చార్జీలను అన్ని ఖాతాలపై వడ్డిస్తుండటంతో సగటు ఖాతాదారులపై అదనపు చార్జీల భారం పడుతోంది.
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు ఆర్‌బీఐ సూచనలకు విరుద్ధంగా ఎస్‌ఎంఎస్ చార్జీలను వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనేనని భారత బ్యాంకింగ్ ప్రమాణాల మండలి (బీసీఎస్‌బీఐ) చైర్మన్ ఏసీ మహజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీఎస్‌బీఐ చేపట్టిన సర్వే ప్రకారం 48 బ్యాంకులకు గాను 19 బ్యాంకులు ప్రతి మూడునెలలకూ రూ 15 ఫిక్స్‌డ్ చార్జీలుగా వసూలు చేస్తున్నాయని తేలింది. ప్రస్తుత పన్నులను కలుపుకుంటే కస్టమర్లు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పొందినందుకు బ్యాంకులకు ప్రతి మూడు నెలలకూ రూ 17.7 చెల్లిస్తున్నారని వెల్లడైంది. ఫిక్స్‌డ్ చార్జీలతో పేద, సామాన్య కస్టమర్లపై భారం మోపడం సరికాదని బీసీఎస్‌బీఐ చైర్మన్ మహజన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment