ఎస్సెమ్మెస్ కొట్టు.. పోలింగ్ స్టేషన్ పట్టు
సాక్షి, సిటీబ్యూరో : ఎస్సెమ్మెస్ కొట్టు.. పోలింగ్ స్టేషన్ పట్టు.. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ క్లిక్ చెయ్.. పోలింగ్ వివరాలు పొందు.. అని నినదిస్తోంది ఎన్నికల యంత్రాంగం. నగరాన్ని ఓటింగ్‌లో మేటిగా తీర్చిదిద్దాలని అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయం గా పెంచేందుకు కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఓటు, పోలింగ్ స్టేషన్ వివరాలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఏర్పాట్లు చేసింది.
www.ghmc.gov.in వెబ్‌సైట్‌లో ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఈ వెబ్‌సైట్ వివరాలు అందించడమే కాకుండా పబ్లిక్ నుంచి ఫిర్యాదులూ స్వీకరిస్తుంది. కాగా ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి సోమేష్ కుమార్ తెలిపారు. ఓటర్లు సందేహాలుంటే తీర్చు కోవచ్చ ని పేర్కొన్నారు. ఒకవేళ ఏ కేంద్రం లోనైనా అధికారులు లేని పక్షంలో 040-21111111 నెంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.