నగరంలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న తమిళనాడు జుడీషియల్ అకాడమిలో ఆదివారం న్యాయమూర్తుల శిక్షణా శిబిరం, న్యాయ శాస్త్ర మెళకువలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
‘పిటిషన్ల’ వివరాలుఎస్‌ఎంఎస్‌లో
Published Mon, Dec 16 2013 1:35 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
సాక్షి, చెన్నై: నగరంలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న తమిళనాడు జుడీషియల్ అకాడమిలో ఆదివారం న్యాయమూర్తుల శిక్షణా శిబిరం, న్యాయ శాస్త్ర మెళకువలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జస్టిస్ ప్రసంగించారు. ఇటీవల కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్లు న్యాయ పరంగా సమస్యల్ని తెచ్చి పెడుతోన్నాయన్నారు. ఓ వైపు కేసుల్ని సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నా, మరో వైపు పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వివరించారు. సాధ్యమైన మేరకు విచారణల్ని త్వరితగతిన ముగించి తీర్పుల్ని వెలువరించాలని న్యాయమూర్తులకు సూచిం చారు.
న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో వ్యవహరించి ముందుకెళ్తే, విచారణ సత్వరం ముగియడంతో పాటుగా బాధితులకు న్యాయం చేసే వీలుందన్నారు. తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కొత్త పథకాల్ని, మరెన్నో కొత్త నిర్ణయాల్ని తీసుకున్నామని వివరించారు. ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపడం విజయవంతం అయిందని గుర్తు చేస్తూ, మద్రాసు హైకోర్టు పరిధిలోనూ ఈ విధానం అమలు చేయబోతున్నామన్నారు. మద్రాసు హైకోర్టు పరిధిలోని కేసుల విచారణలు, పిటిషన్ల వివరాలు, ఏ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందో, ఆ పిటిషన్ ప్రస్తుత పరిస్థితి తదితర వివరాల్ని పిటిషనర్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో అందజేయనున్నట్లు చెప్పారు. లోక్ అదాలత్‌ల ద్వారా అత్యధిక కేసుల్ని పరిష్కరించిన కోర్టుగా మద్రాసు హైకోర్టు ముందంజలో ఉందని కితాబు ఇచ్చారు.
వినూత్నంగా ఉరి కేసులు: ఇటీవల ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వాళ్లు కోర్టుల్ని ఆశ్రయించడం పెరుగుతోందన్నారు. ఇవి వినూత్న పరిస్థితుల్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. కోర్టు ద్వారా ఉరి శిక్ష ఖరారైన తరువాత కొన్నేళ్ల మౌనంగా ఉండి మళ్లీ కోర్టును ఆశ్రయించడం వినూత్నమేనంటూ చమత్కరించారు. రాష్ట్రపతి వద్ద తమ క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున, ఆ శిక్షను తమకు తగ్గించాలని, తమను విడుదల చేయాలంటూ దాఖలవుతోన్న పిటిషన్లను చూస్తుంటే, వినూత్నంగానే ఉంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ కుమార్ అగర్వాల్, న్యాయమూర్తులు చిత్రా వెంకటరామన్, సుధాకరన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement