1..15..551
- ఓటర్లకు పార్టీల గాలం
- మొదలైన బల్క్ ఎస్‌ఎంఎస్‌ల జోరు
- కేసులు తప్పవంటున్న పోలీసులు
సాక్షి,సిటీబ్యూరో: ఇదేంటి లెక్క అనుకుంటున్నారా..? ఏమి లేదు.. ‘మేం ఒక ఎస్‌ఎంఎస్ పంపిస్తాం..దాన్ని 15 మందికి పంపించాలి..అలా చేస్తే రూ.551 రీచార్జీ ఫ్రీ’ అంటూ ఆయా పార్టీలు ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో పార్టీలు కూడా ఓటర్ల సెల్‌నెంబర్లు సేకరించి ఈ నయా ప్రచారం ప్రారంభించాయి. ‘పలానా పార్టీ నాయకుడికి ఓటేయండి’ అని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం శనివారం నుంచి మొదలైందని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమరం ఈసారి రసవత్తరంగా సాగుతుండడంతో అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొత్తదారులను ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్న పార్టీ నేతలు, సెల్‌ఫోన్ల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. నామినేషన్ల ఘట్టం ఓ పక్క జోరుగా సాగుతుండగానే మరోపక్క వివిధ పార్టీలు బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. వీటిని నమ్ముతున్న కొందరు ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లు చేసినట్లు సమాచారం.
పోలీసుల కన్ను : బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అంటున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌లపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇది కూడా ఒకరకమైన ఎన్నికల నిబంధన ఉల్లంఘనేనని..ఎస్‌ఎంఎస్‌లు ప్రచారం చేస్తే సెల్‌కు రీచార్జీ చేస్తామనడం నేరంగా పరిగణిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
చర్యలు తీసుకుంటాం..
ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టే. డబ్బులకు ఆశపడి ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లను ఇతరులకు పంపిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. వివరాలను పోలీసులకు అందిస్తే తప్పక చర్యలు తీసుకుంటాం.
- అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్