గొర్రెలు అమ్ముతామంటూ.. | Maharashtra thieves kidnap veterinarian Tirupati | Sakshi
Sakshi News home page

గొర్రెలు అమ్ముతామంటూ..

Published Sat, Jul 8 2017 2:12 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

గొర్రెలు అమ్ముతామంటూ.. - Sakshi

గొర్రెలు అమ్ముతామంటూ..

► మంచిర్యాల పశు వైద్యుడు తిరుపతిని కిడ్నాప్‌ చేసిన మహారాష్ట్ర దొంగలు
► 9 యూనిట్లు అమ్మినట్టు సంతకం పెట్టి రూ.9 లక్షలు ఇప్పించాలని హుకుం
► చాకచక్యంగా తోటి డాక్టర్‌కు ఎస్‌ఎంఎస్‌ పెట్టిన తిరుపతి
► స్పందించిన ప్రభుత్వం.. మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు
►  సాయంత్రం 4 గంటలకు వదిలిపెట్టిన దుండగులు..


సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పథకం ఓ పశు వైద్యుడి ప్రాణం మీదకు తెచ్చింది. గొర్రెలు కొనడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్తే దుండగులు కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. తాము గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టించుకుని రూ.9 లక్షలు కాజేయాలని యత్నించారు. అయితే సదరు డాక్టర్‌ అప్రమత్తతతో వ్యవహ రించి తోటి వైద్యుడికి ఎస్‌ఎంఎస్‌ పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. దీంతో కిడ్నాప్‌ అయిన డాక్టర్‌ క్షేమంగా విడుదలయ్యారు.

గురువారమే ఫోన్‌..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేస్తున్న పశు వైద్యుడు తిరుపతి.. గొర్రెల పథకం కింద గొర్రెల కొనుగోలు కోసం మహారాష్ట్రలోని బిగువాన్‌ జిల్లా సంగోలా ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉండి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమ యంలో ఆయనకు కొందరు ఫోన్‌ చేసి తాము గొర్రెలు అమ్ముతామని చెప్పారు. వారి వద్దకు వెళ్లి గొర్రెలను పరిశీలించిన తిరుపతి.. ఒక్క యూనిట్‌ (21 గొర్రెలు) మాత్రమే పనికి వస్తుందని చెప్పారు.

అయితే తమ వద్ద ఇంకా గొర్రెలు ఉన్నాయని, శుక్రవారం చూపెడతా మని చెప్పి డాక్టర్‌ను వెనక్కు పంపారు. చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం 8 గంటలకు తిరుపతికి ఫోన్‌ చేశారు. తాము వస్తున్నామని, ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ ఆరా తీశారు. తాను బస చేస్తున్న హోటల్‌ పైనుంచి కిందకు దిగి ఫోన్‌ మాట్లాడుతుం డగా బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి తిరుపతిని కొట్టుకుంటూ బలవంతంగా వాహనం ఎక్కించారు. అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏక్తాపూర్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు.

తాము 9 యూనిట్ల గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టి, ఆన్‌లైన్‌లో తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.9 లక్షలు జమ చేయించాలని డిమాండ్‌ చేశారు. ‘గొర్రెలను కొనుగోలు చేసేందుకు పశు వైద్యులను పంపడం అన్యాయం. రేపు ఏది జరిగినా మా మీదే వేస్తారు. అందుకే టెండర్లు పిలవాలి. లేదంటే విక్రేతలు, కొనుగోలు దార్లను ఓ చోట చేర్చి సంత తరహాలో ఏర్పాట్లు చేయాలి’ అని టీఏహెచ్‌ఓఎస్‌ఏ అధ్యక్షుడు డాక్టర్‌ బాబుబేరి అన్నారు.

ఐ యామ్‌ కిడ్నాప్‌డ్‌.. డోంట్‌ సెండ్‌ మనీ
గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కమిటీ పక్షాన గొర్రెలను కొన్న వైద్యుడు సంతకం పెట్టి ఉన్నతాధికారులకు చెబితే వారు డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఆ ట్రాన్స్‌ఫర్‌ చేసే అంశాన్ని హిందీలోనే మాట్లాడాలని కిడ్నాపర్లు తిరుపతిని బెదిరించారు. ‘వీళ్లు తొమ్మిది యూనిట్ల గొర్రెలు విక్రయించారు. డబ్బులు పంపండి’ అని హిందీలో చెప్పించారు. అదే సమయంలో తిరుపతి మరో డాక్టర్‌కు ‘ఐ యామ్‌ కిడ్నాప్‌డ్‌.. డోంట్‌ సెండ్‌ మనీ’ అంటూ మెసేజ్‌ పంపారు. వెంటనే సదరు డాక్టర్‌.. తిరుపతి కిడ్నాప్‌ అయిన విషయాన్ని జిల్లా అధికారులకు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌కు తెలియజేశారు.

డైరెక్టర్‌ డాక్టర్‌.డి. వెంకటేశ్వర్లు వెంటనే అడిషనల్‌ డీజీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు విషయాన్ని తెలియజేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు, సీఎస్‌లతో తలసాని సంప్రదింపులు జరిపి తిరుపతి ఎక్కడున్నారో కనిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల కదలికల గురించి తెలుసుకున్న కిడ్నాపర్లు సుమారు 8 గంటల అనంతరం సాయంత్రం 4.00 సమయంలో తిరుపతిని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో వదిలివెళ్లారు. తిరుపతిని కిడ్నాపర్లు ఘోరంగా కొట్టారని, అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు సాయంత్రం మహారాష్ట్ర నుంచి మంచిర్యాల బయలుదేరేందుకు తిరుపతి ఏర్పాట్లు చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement