నీటి సరఫరా వేళలు ఇక ఎస్‌ఎంఎస్‌లో | SMS to the water supply hours | Sakshi
Sakshi News home page

నీటి సరఫరా వేళలు ఇక ఎస్‌ఎంఎస్‌లో

Published Sun, Aug 21 2016 9:56 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

నీటి సరఫరా వేళలు ఇక ఎస్‌ఎంఎస్‌లో - Sakshi

నీటి సరఫరా వేళలు ఇక ఎస్‌ఎంఎస్‌లో

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నల్లా నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక...నిత్యం టెన్షన్‌కు గురయ్యే వినియోగదారులకు శుభవార్త. నీటి వేళల వివరాలు ఇక నేరుగా మీ మొబైల్‌కే పంపేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఫలానా సమయంలో మీ ఇంట్లో నల్లా నీళ్లు వస్తాయని మీ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. తద్వారా నీటి కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. మొదట ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలోని సుమారు 70 వేల మందికి నీటిసరఫరా జరిగే వేళలపై వారి సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు.

ఇదే తరహాలో నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సెప్టెంబరు 15 నుంచి సంక్షిప్త సందేశాన్ని అందజేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్లు ఆయా వీధులకు నీటిని మళ్లించేందుకు వాల్‌్వను తిప్పిన సమయంలో ఆ వాల్వ్‌ పరిధిలో ఉన్న వినియోగదారులకు ఈ సమాచారం వారి ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌ రూపంలో ప్రత్యక్షం కానుండడంతో వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా ఉండనుంది.

జీపీఎస్‌ సాంకేతికతతో ఎస్‌ఎంఎస్‌లు....
వినియోగదారులకు సంక్షిప్త సందేశం అందించేందుకు జలమండలి గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం(జీపీఎస్‌)సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్‌లకు స్మార్ట్‌ఫోన్లను అందజేసి..అందులో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకొని వాల్వ్‌ తిప్పేందుకు లైన్‌మెన్‌ వెళ్లినపుడు అతని ఫోన్‌లో ఆ వాల్వ్‌ నెంబరు ప్రత్యక్షమౌతుంది. ఆ నెంబరుపై అతడు నొక్కినపుడు ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలో ఉన్న సర్వర్‌కు చేరుతుంది.

అక్కడి నుంచి ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ఆ వాల్వ్‌ పరిధిలో ఉన్న అందరు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది. ఇదే సమాచారం క్షేత్రస్థాయి మేనేజర్‌ సెల్‌ఫోన్‌కు కూడా అందుతుంది. దీంతో ఒక ప్రాంతానికి అత్యధిక సరఫరా..మరొక వీధికి తక్కువ నీటి సరఫరా ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

లైన్‌మెన్ల అక్రమాలకు చెక్‌...
నీటిసరఫరాపై వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ సందేశం అందించడం ద్వారా లైన్‌మెన్ల చేతివాటానికి చెక్‌పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకొని ఒక ప్రాంతానికి అధికంగా..మరొక ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.

ప్రయోగాత్మకంగా జల్‌యాప్‌ వినియోగం..
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్లకు నిత్యం వినియోగదారుల నుంచి వినపడే కలుషిత జలాలు..అరకొర నీటిసరఫరా, మూతలు లేని మ్యాన్‌హోల్స్‌ వంటి 9 రకాల సమస్యలపై జలమండలి రూపొందించిన జల్‌యాప్‌ ప్రయోగాత్మకంగా వంద మంది లైన్‌మెన్ల వద్దనున్న స్మార్ట్‌ఫోన్ల ద్వారా అమలు చేస్తున్నారు.

జల్‌యాప్‌కు అందే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్‌కు రూ.2 లక్షలు నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు.  ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ను నియమిస్తున్నామన్నారు. సెప్టెంబరు నెలలో జలమండలిలో పనిచేస్తున్న మూడువేల మంది లైన్‌మెన్ల చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్లకు జల్‌యాప్‌ అందుబాటులోకి రానుందన్నారు.

సెప్టెంబరు 15 నుంచి అన్ని నల్లాలకు...
జలమండలి పరిధిలో ప్రస్తుతం 8.76 లక్షల నల్లాలున్నాయి. ప్రస్తుతానికి కూకట్‌పల్లి డివిజన్‌ ప్రాంతంలో సుమారు 70 వేల నల్లాలకు ఎస్‌ఎంఎస్‌ సందేశం అందుతోంది. మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబరు 15 నుంచి ఎస్‌ఎంఎస్‌ సమాచారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

ఇందుకోసంlమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్‌్వలను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్‌ సాంకేతికతతో అనుసంధానిస్తున్నాం. దీంతోS బోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్‌ నెంబర్లకు నీటిసరఫరా వేళలపై ఎస్‌ఎంఎస్‌ సందేశం అందనుంది.
                      – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement