సెల్ టవర్లు పేల్చడం నుంచి సెల్ మెసేజీల దాకా...
సెల్ టవర్లు పేల్చేసే మావోయిస్టులు ఇప్పుడు సెల్ ఫోన్ నుంచి మెసేజీలు పంపిస్తున్నారు. మావోయిస్టు ఎస్సెమ్మెస్ లు ప్రజలను పోలింగ్ ను బహిష్కరించమని పిలుపునిస్తున్నాయి.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓటర్లకు ఎన్నికలను బహిష్కరించమని ప్రజలకు ఎస్సెమ్మెస్ లు వస్తున్నాయి. పీడిత, తాడిత, కార్మిక, కర్షక తదితర వర్గాల ప్రజలను ఈ మేరకు పిలుపునిస్తున్నామని సీపీఐ-మావోయిస్టుపార్టీ సరిహద్దు జోన్ కమిటీ ప్రతినిధి అవినాశ్ పేరిట ఈ ఎస్సెమ్మెస్ లు పంపించారు. అంతే కాక తమ పార్టీ కార్యకర్తలను, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులను ఈ ఎన్నికల బహిష్కరణను విజయవంతం చేయడానికి గాను పనిచేయమని ఎస్సెమ్మెస్ ల ద్వారా కోరారు. పోలీసులు, రక్షణ బలగాలపై కూడా దాడులు చేయమని పిలుపునిచ్చారు.
ఇవే కాక జాముయ్, లఖ్కీసరాయ్, బాంకా, గయా, ఔరంగాబాద్ లలో మావోయిస్టు పోస్టర్లు కూడా వెలిశాయి. పలు చోట్ల పోలీసులు ఆ పోస్టర్లను చింపివేశారు. మావోయిస్టుల ఎస్సెమ్మెస్ యుద్ధం ఇప్పుడు ఆ ప్రాంతాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది.