నకిలీ మద్యం బెడద తప్పబోతోంది. దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం అసలుదా? నకిలీదా? ఎక్కడ తయారైంది? ఎవరు కొనుగోలు చేశారు?
సాక్షి, కర్నూలు: నకిలీ మద్యం బెడద తప్పబోతోంది. దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం అసలుదా? నకిలీదా? ఎక్కడ తయారైంది? ఎవరు కొనుగోలు చేశారు? అనే వివరాలను ఒక్క సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్)తో ఇట్టే తెలుసుకునే వీలు త్వరలో అమల్లోకి రానుంది. సర్కారీ మద్యంలో నాణ్యతను వెల్లడించడంతో పాటు నకిలీ మద్యాన్ని నిలువరించే దిశగా ఎక్సైజ్‌శాఖ సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగానే మద్యం సీసాలపై హోలోగ్రామ్‌లు వేయడంతో పాటు, ఒక్క ఎస్‌ఎంఎస్‌తో మందుబాబులు తాము కొన్న సీసా తాలూకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న ఎక్సైజ్‌శాఖలో సరికొత్త విధానాల అమలుకు సర్కారు ప్రయత్నిస్తోంది. పర్మిట్ రూములు, ఔట్‌లెట్లతో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ప్రభుత్వం.. మద్యంలో నాణ్యత ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తయారవుతున్న మద్యం సీసాలపై లేబుల్స్ ఉంటున్నాయి. అయితే అక్రమార్కులు నకిలీ లేబుళ్లతో నాసిరకం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ కారణంగా ఖజానాకు భారీగా గండిపడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రతి మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో సీసాపై ఒక సీరియల్ నెంబర్‌ను ముద్రించనున్నారు.
ఈ నెంబర్ ఆ సీసాకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని వెల్లడించనుంది. కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. సీసా సమాచారం తెలుసుకోదలిస్తే దానిపైనున్న ప్రత్యేక సీరియల్ నెంబర్‌ను టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే చాలు.. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు, ఎక్కడ తయారైంది. ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది. ఏ దుకాణానికి అమ్మకం చేశారు. ఇతరత్రా వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. ఈ నూతన విధానంతో నకిలీ మద్యానికి చెక్ పడనుంది.