
ఎస్సెమ్మెస్‌లు పంపి.. రేప్ కు యత్నించాడు!
నాగోలు : ఎస్సెమ్మెస్‌లు పంపి ఎందుకు వేధిస్తున్నావని నిలదీసేందుకు వెళ్లిన యువతిపై స్నేహితులతో కలిసి లైంగికదాడికి యత్నించాడో ఘనుడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం తిమ్మాపురానికి చెందిన యువతి ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన మెకానిక్ శ్యామ్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది.
పెళ్లి చేసుకుంటానని 2012 నుంచి శ్యామ్ ఆమె వెంట తిరిగాడు. ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ తరచూ యువతికి ఎస్సెమ్మెస్‌లు పంపుతూ, ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. ఎందుకు వేధిస్తున్నావని ఆమె శ్యామ్‌ను నిలదీసేందుకు అతడి మెకానిక్ షాపు వద్దకు వెళ్లగా... స్నేహితులతో కలిసి లైంగికదాడికి యత్నించాడు. వారి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు ఎల్బీనగర్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.