
కొన్ని అక్షరాలు ఒక టెంప్లేటు
ఓ సెండ్ బటన్ కాదు సందేశమంటే
గుడ్డి గుడ్నయిట్లు ఎడ్డి గుడ్మార్నింగులు
సోది స్టేటస్‌లు కాదు సందేశమంటే
సందేశమంటే ఒక పొద్దుపొడుపు
ఒక జననం కోసం మరణం
సందేశమంటే సవరణలుండని రాజ్యాంగం
జీవన వ్యాకరణం
జన్మదిన అభినందనలో పుట్టుక అర్థం ఉండాలి
పెళ్లి రోజు శుభాకాంక్షలో దేహాత్మల సంగీతం ఉండాలి
రిప్ అంటే కన్నీళ్ల కుప్ప ఉండాలి
అధికారం కోసం విపక్షం పెట్టుకునే అర్జీ కాదు సందేశమంటే
అస్మాలాగా ఒక అరుపు అరువు
దేశాలు పేకమేడల్లా కూల్తాయి
మల్లెలవిప్లవాలు చెలరేగుతాయి
సందేశాలు శాంతి ప్రపంచాల్ని నిర్మించాలి
ఆధిపత్యాల కొమ్ములు విరగ్గొట్టాలి
శ్వాసకు ఊపిరి బాటకు నడక
దీపానికి కొత్తనూనె... సందేశం
రాజ్యాన్ని కూల్చే నినాదం
చెమట కోసం పాడే మల్లెల పాట సందేశం
దాహానికి చెలిమె
ఉక్కకు చలివణుకు సందేశం
ప్రభువులు తమను తాము కాపాడుకునే కవచం కాదు సందేశం
ఒక ఎస్సెమ్మెస్ కోసం కాలం కలలు కనాలి
ఒక ఎస్సెమ్మెస్ మార్కెట్ మత్తుకు మందు కావాలి
ఒక ఎస్సెమ్మెస్ దీనజనుల మెడలో దండ కావాలి
గూగుల్ ఉసిళ్లపుట్ట మెసేజ్‌ల లింగనపురుగులూ కాదు కావల్సింది
సందేశం భగవద్గీత కావాలి
సందేశం బతుకు ఉద్యమం కావాలి
బతుకు టెంప్లేటై చేయూతే అక్షరమైతే పంచే విశ్వాసమే
సెండ్ బటనై ప్రసరించాలి
ఒక సందేశం మనుషులందరినీ ఒకే గాటన కట్టేసే ప్రేమదారం కావాలి
జూలూరు గౌరీ శంకర్
9440169896
Comments
Please login to add a commentAdd a comment