న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్‌ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్‌లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి తెలిపాయి. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్‌లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్‌వర్క్‌లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది.
రూ. 30,000 కోట్ల బకాయిలు..
బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది.
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్‌లూ పెరుగుతాయ్
Published Fri, Aug 16 2013 2:17 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement
Advertisement