
ఇక మొబైల్‌ఫోన్ గవర్నెన్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై మరింత స్మార్ట్ కానున్నాయి. చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు తదితర పనుల్లో ఎస్సెమ్మెస్‌లను వినియోగదారులకు పంపనున్నాయి. వాటినే వారు ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించవచ్చు. అలాంటి సౌకర్యాన్ని కల్పించే ‘మొబైల్ సేవా’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. వంద సంస్థలకు సంబంధించి పెలైట్ ప్రాజెక్టును సమర్థవంతంగా పూర్తి చేసిన తర్వాత 241 అప్లికేషన్లతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్లికేషన్లలో ఆర్టీఐ, ఆరోగ్యం, ఆధార్, విద్య తదితర సర్వీసులకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జె. సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం డిజిటల్ సిగ్నేచర్ ఉన్నవాటిని ధ్రువపత్రాలుగా స్వీకరిస్తున్నామని, అలాంటి నిబంధనలే మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా రూపొందించాలన్నారు.