సమస్య ఏదైనా.. ఎస్‌ఎంఎస్ పంపు
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలికలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా స్వాతంత్య దినోత్సవం పురస్కరించుకొని కార్పొరేషన్ కమిషనర్ ఎస్‌ఎంఎస్ సేవా సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని మహరాష్ట్రలో మొదటి సారిగా ప్రారంభించారు.
దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఇలాంటి ఎస్.ఎమ్.ఎస్. సేవా సదుపాయాలు చేపట్టారు. దీంతో 100 శాతం క్లీన్ సిటీగా యావత్ భారత దేశంలో పేరుగాంచిన విషయం తెలిసిందే. దీని స్ఫూర్తిగా తీసుకున్న భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక కమిషనర్ జీవన్ సోనావునే ఎస్‌ఎంఎస్ సేవల సదుపాయాన్ని కల్పించారు.
గతంలో ఇలా..
కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితి కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో ఉన్న సమస్యలైన చెత్త పేరుకొని పోవడం, మురికి కాలువల శుభ్రత, విష క్రిమికీటనాశక మందులు వెదజల్లుట, వీధి దీపాలు, మంచినీటి సమస్య, మరుగు దొడ్ల అపరి శుభ్రత తదితర సమస్యలపై ఆయా కార్యాలయాలల్లో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేవారు. ప్రస్తుతం పట్టణంలో జన సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతోపాటే సమస్యలు కూడా అధికమయ్యాయి. సమస్యల పరిష్కారానికి కార్పోరే షన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉండేది. ఈ ఫిర్యాదులను అందుకుని పనులు నిర్వహించే వరకు కనీసం నాలుగైదు రోజులు పట్టేది. అలా సమయం వృథా కావడంతోపాటు ప్రజలు ఇబ్బందులు తొలగిపోలేదు.
ప్రస్తుతం ఇలా..
కానీ ఇప్పుడు కమిషనర్ సోనావునే ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించడానికి మొబైల్ నంబర్‌ను (9970001312) ప్రకటించారు. సంబంధించిన సమస్యను టైపు చేసి ఎస్‌ఎంఎస్ చేయవచ్చుని, ఇంకా 10 భాగాలకు ఇంటర్‌కం సదుపాయాలు కల్పించామని కమిషనర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా ముబైల్ వాడుతున్నారని, వారికి కలుగుతున్న సమస్యలను వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఇది ఖర్చుతో కూడిన పని కాదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.