ఎస్‌ఎంఎస్‌లతో జర జాగ్రత్త!
* షాపింగ్ ప్రియులకు గాలం
* లాటరీ పేరిట ఎస్‌ఎంఎస్‌లు
* సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు
* ఆశ పడితే అంతే సంగతులు
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అరుణ్ ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. అక్కడ ‘వెల్‌కమ్’ అంటూ ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. వివిధ ఆఫర్ల గురించి చెబుతూ వీరి పూర్తి వివరాలను సేకరించాడు.కొన్ని రోజుల వ్యవధిలోనే అరుణ్ సెల్ నంబర్‌కురూ.50 కోట్ల లాటరీ తగిలిందంటూ కోకాకోలా కంపెనీ పేరిట ఎస్‌ఎంఎస్ వచ్చింది. దీంతో ఆయన ఎగిరి గంతేశాడు. వాళ్లు చెప్పినట్టుగా పన్నుల పేరిట దఫదఫాలుగా సుమారు రూ.పది లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న అరుణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు దొరికినా... డబ్బులు మాత్రం రికవరీ కాలేదు....
ఇది ఒక్క అరుణ్ పరిస్థితే కాదు... షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన వేలాది మందికి లాటరీలని, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలిస్తామని... ఇలా వివిధ రూపాల్లో సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంస్‌లు వెల్లువెత్తుతున్నాయి. ‘లక్’ ఎంతో పరీక్షించుకుందామని ప్రయత్నిస్తున్న వారు అడ్డంగా దొరికిపోతున్నారు.
షాపింగ్ ప్రియులే టార్గెట్...
ఇన్నాళ్లూ ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఫోన్ నంబర్లను సేకరిస్తున్న సైబర్ ముఠాలు... ఇప్పుడూ ఏకంగా షాపింగ్ ప్రియులనే టార్గెట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు వివిధ దుకాణాలు ప్రకటిస్తున్న ఆఫర్‌లకు క్యూ కడుతూ... లక్కీ డ్రా తలుగుతుందనే ఆశతో తమ చిరునామాతో సహా పూర్తి వివరాలను సమర్పిస్తున్న వారి నుంచి నయా పద్ధతుల్లో డబ్బులు లాక్కొనే ప్రయత్నానికి తెర లేపాయి.
వివిధ పద్ధతుల్లో తమ నెట్‌వర్క్ ద్వారా షాప్‌ల నుంచి చిరునామాలను సేకరించి లాటరీల పేరుతో సెల్‌ఫోన్‌లో ఎస్‌ఎంస్‌లు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నాయి. బంపర్ ఆఫర్‌లు, లక్కీ డ్రాలపై ఆశతో ఉన్న కొందరి బలహీనతను ఆసరాగా చేసుకుంటే రూ.లక్షల్లో కొట్టేయవచ్చని పథకాలు రచిస్తున్నాయి. జంట పోలీసు కమిషనరేట్లలోనే కాదు... దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఈ తంతుకు తెరలేపి ఒకేసారి లాటరీల పేరిట లక్షల మందికి ఎస్‌ఎంఎస్‌లు పెడుతున్నారు.
బహుళ జాతి కంపెనీలు కోకాకోలా, రిబాక్, నైక్, సోనీ, మెర్సిడెజ్ బెంజ్ కంపెనీల లాటరీలు తగిలిందంటూ పంపిన ఎస్‌ఎంఎస్‌లకు స్పందించిన వారిని నమ్మించి పన్నుల రూపంలో బాదేస్తున్నారు. మరి కొంతమందికి తక్కువ వడ్డీలకు రూ.లక్షల్లో రుణం ఇప్పిస్తామని నమ్మించి కుచ్చు టోపీ పెడుతున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరిట భారీమొత్తంలో డబ్బు కాజేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండండి...
పెద్ద మాల్స్‌లో షాపింగ్ చేసేటప్పుడు... పెట్రోల్ బంక్‌లలో కార్డులు వినియోగించినప్పుడు వాటిని నైజీరియన్లు హ్యాక్ చేస్తున్నారు. తమ నెట్‌వర్క్‌తో వారి చిరునామాలను సంపాదిస్తున్నారు. ఆ తర్వాత లాటరీ పేరుతో బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. స్పందించిన వారికి భారీ మొత్తంలో టోకరా పెడుతున్నారు. అందుకే లాటరీ వచ్చిందని ఎస్‌ఎంఎస్‌లు వస్తే జాగ్రత్తపడాలి.
- జయరాం, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్