హిమాయత్‌నగర్: ఒక్క ఎస్సెమ్మెస్సే కిడ్నాపర్లను పట్టించింది. పోలీసులు బాలుడి కిడ్నాపర్ల చెరనుంచి విముక్తి కలిగించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ పోలీసులు సంయుక్తగా నిర్వహించిన ఈ ఆపరేషన్ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. హిమాయత్‌నగర్ 3వ వీధిలో నివసించే ఎల్.నరేందర్ నారాయణగూడ వై- జంక్షన్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతని చిన్న కుమారుడు సంజిత్ నారాయణగూడ వెంకటేశ్వర కాలనీలో ట్యూషన్‌కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఐదు బృందాలుగా విడిపోయి నగరంలోని అన్ని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేశారు.
రూ. 50 లక్షల ఇవ్వాలని సంక్షిప్త సందేశం...
రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి దాటాక బాలుడి తండ్రి నరేంద్రకు ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. అప్పటి వరకు నిందితులను పట్టుకొనేందుకు సరైన క్లూ లేక తలలు పట్టుకొన్న పోలీసులకు ఆ ఎస్సెమ్మెస్ కొండంత బలాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా దుండగుల కోసం వేట మొదలెట్టారు. కిడ్నాపర్లు బోయినపల్లి పీఎస్ పరిధిలోని అస్మత్‌పేటలోని ఓ ఇంటిలో చిన్నారి సంజిత్‌ను దాచిపెట్టారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు బుధవారం ఉదయం పంజగుట్ట, సికింద్రాబాద్ మధ్య తిరిగారు. చివరకు పోలీసులు ప్రధాన నిందితుడు విజయకుమర్‌తో పాటు హేమంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా బాలుడి ఆచూకీ చెప్పారు. వెంటనే పోలీసులు వెళ్లి బాలుడి రక్షించారు. ఈ ఆపరేషన్‌లో అబిడ్స్ ఏసీపీ రాఘవేంద్రరెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈజీ మనీకోసం...
సంజిత్‌ను మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లకు చెందిన విజయకుమార్(26) కిడ్నాప్ చేశాడు. ఆరేళ్ల క్రితం విజకుమార్ కిడ్నాప్‌కు గురైన సంజిత్ తండ్రి మెడికల్ షాపులో పని చేసి మానేశాడు. ప్రస్తుతం సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇతను హరిత (36) అనే జూనియర్ ఆర్టిస్ట్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సంజిత్ కిడ్నాప్‌కు పథకం వేశాడు. తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ. 20 వేలు ఇస్తానని హరిత, ఆమె కొడుకు హేమంత్‌కుమార్ (22), కూతురు స్వాతి (18), ఆటో డ్రైవర్ సయ్యద్ మున్నాతో ఒప్పందం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు బాలుడ్ని కిడ్నాప్ చేసుకెళ్లారు. చివరకు పోలీసులకు చిక్కారు.
కిడ్నాపర్లను పట్టించిన ఎస్సెమ్మెస్
Published Wed, Apr 1 2015 11:17 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement
Advertisement