
ఒక్క ఎస్సెమ్మెస్‌తో ఇంటికే మద్యం
సాక్షి, హైదరాబాద్: మీ మొబైల్ నుంచి ఒక్క ఎస్సెమ్మెస్ ఇస్తే చాలు మద్యం మీ ఇంటికే వస్తుంది. ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొనసాగుతున్న తంతు ఇది. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ఆదాయం మరింత పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో మద్యం షాపుల యజమానులు ఇప్పుడు డోర్ డెలివరీ విధానాన్ని అమలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి గ్రామాలకు డోర్ డెలివరీ యథేచ్చగా సాగుతోంది. గ్రామాల్లో మద్యం కావలసిన వారు మండల కేంద్రంలోని మద్యం దుకాణదారుడి మొబైల్‌కు ఒక్క ఎస్సెమ్మెస్ ఇస్తే నిమిషాల్లో బాటిళ్లు సరఫరా అవుతున్నాయి.
ఇందుకోసం ద్విచక్ర వాహనాలతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని దూరప్రాంత గ్రామాల్లోని బెల్ట్‌షాపుల్లో స్టాకును నిలువచేస్తున్నారు. మండల కేంద్రంలోని షాపు యజమానికి ఎస్సెమ్మెస్ రాగానే గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే డోర్ డెలివరీ చేయాలని ఆదేశిస్తున్నారు.
మాల్స్‌లోనూ మద్యం
కర్ణాటక మద్యం విధానంలో భాగంగా పెద్ద పెద్ద మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరుల్లోని అయిదు మాల్స్‌లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ లెసైన్సులను మంజూరు చేసింది. ఆ మాల్స్‌లో మద్యం విక్రయాల గిరాకీ బాగా ఉందని, ఉద్యోగస్తులతో పాటు యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తేలింది.
త్వరలో నూతన బార్ల విధానం
పర్యాటక విధానానికి అనుగుణంగా అన్ని హంగులతో నూతన బార్ల విధానం ఉంటుందని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పర్యాటక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే నూతన విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ మద్యం దుకాణాల్లో నౌకర్ నామా ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.5వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.