ఒక్క ఎస్సెమ్మెస్తో ఆ అలవాటు పోతుందట!
న్యూయార్క్: ఒక పనిని ఒక రోజు చేసి వదిలేస్తే అది అవసరం.. అదే పని మరో రోజు కూడా చేస్తే అలవాటు.. అదే అలవాటు విడిచిపెట్టకుండా కొనసాగిస్తే బానిసత్వం. ఈ రోజుల్లో అవసరాల రీత్యా వ్యక్తికి బానిసత్వం తప్పదుగానీ.. అతడి అలవాట్లలో ఈ లక్షణం ఉండకూడదు. అది చెడు అలవాట్లలో అయితే.. ఇంకా డేంజర్. అందుకే వ్యక్తికి ఉండే చెడుఅలవాట్లలో ఒకటైన ధూమపానం గురించి తెగ హెచ్చరికలు చేస్తుంటారు. ప్రసార మాధ్యమాలన్నింటిని ఉపయోగిస్తుంటారు.
భారత దేశంలోని ఏ మూలన సినిమాకు వెళ్లినా తొలుత మనకు దర్శనం ఇచ్చేది 'ఈ నగరానికి ఏమైంది..' అంటూ వచ్చే ప్రకటన. అయితే, పొగరాయుళ్లను మార్చేందుకు అంతపెద్ద శ్రమ కూడా అవసరం లేదని.. వారికి కాస్తంత చైతన్యం ఇచ్చేలా కొన్నికొన్ని సంక్షిప్త సమాచారాలను(ఎస్సెమ్మెస్) ఫోన్ ద్వారా పంపిస్తే ఇట్టే మారిపోతారని అధ్యయన కారులు చెబుతున్నారు.
'నువ్వు చేయగలవు' 'ధృడంగా ఉండు'వంటి ఎస్సెమ్మెస్లు చేయడం ద్వారా పొగతాగే అలవాటున్న వ్యక్తులకు ఆ అలవాటును పూర్తిగా మాన్పించవచ్చంట. అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనకారులు ఈ సర్వే నిర్వహించారు. ఎవరెవరు పొగతాగుతున్నారో వారి వివరాలు తెలుసుకొని వారికి ఒక వ్యవస్థ ద్వారా ప్రత్యేక ఎస్సెమ్మెస్లు పంపిస్తే వారిలో ఆ ఆలోచన తగ్గించవచ్చని ఆ అధ్యయనం వివరించింది.