smokers
-
ప్రకాశం జిల్లాలో అత్యధికం.. వైఎస్సార్ జిల్లాలో అత్యల్పం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు పైబడిన వారిలో 22.6 శాతం మంది పొగరాయుళ్లేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక 15 ఏళ్లు దాటిన మహిళల్లో 3.8 శాతం మందికి ధూమపానం అలవాటు ఉన్నట్లు సర్వే పేర్కొంది. పురుషుల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 28.2 శాతం మంది పొగ తాగుతుండగా అత్యల్పంగా వైఎస్సార్ కడప జిల్లాలో 18 శాతం మందికి ఈ వ్యసనం ఉంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పొగతాగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం పురుషులు పొగతాగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో 25.6 శాతం మంది పొగ తాగుతున్నారు. మహిళల్లో 1.9 శాతం మంది పట్టణాల్లో, 4.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో పొగ పీలుస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు ఎక్కువగా పొగ తాగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికం.. దేశంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు తేలింది. మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు, పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే తెలిపింది. తెలంగాణలో 22.3 శాతం పురుషులు, 5.6 శాతం మంది మహిళలు పొగతాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా బిహార్‌లో 48.8 శాతం, గుజరాత్లో 41.1 శాతం, మహారాష్ట్రలో 33.8 శాతం మంది పురుషులు పొగతాగుతున్నట్లు సర్వే పేర్కొంది. -
పొగ తాగే వారికి ఈ సమస్యలు తప్పవు ..!
కొంతమంది చాలా సుదీర్ఘకాలం నుంచి పొగతాగుతూ ఉంటారు. ఇలాంటివారిని ‘క్రానిక్ స్మోకర్స్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎందుకు, ఎలా వస్తాయో చూద్దాం. కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. స్మోకింగ్ కోసం తరచూ లైటర్ లేదా అగ్గిపుల్ల ఉపయోగించి, ఆ మంటను నోటి దగ్గరికి తీసుకెళ్లినప్పుడల్లా అది కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంది. అలా మాటిమాటికీ ఆ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య కూడా వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్లాగానో, నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేయాలి. ఆ తరవాత వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మన చూపును పోగొట్టి దృష్టిదోషాలు తెచ్చే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం చాలా మంచిది. చదవండి: తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు! -
పొగరాయుళ్లకు పొగపెట్టారు
సాక్షి,న్యూఢిల్లీ: పొగతాగే అలవాటుకు పొగపెట్టేందుకు జపాన్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీ వినూత్న ఒరవడిని అనుసరించింది. తమ సంస్థలో పొగతాగని ఉద్యోగులకు ఏడాదిలో అదనంగా ఆరు రోజుల హాలిడేను ప్రకటించింది. పొగరాయుళ్లలాగా సిగరెట్ తాగేందుకు తరచూ బ్రేకులు తీసుకోకుండా బుద్ధిగా పనిచేసుకునే వారికి ఈ నజరానా ప్రకటించింది. పొగతాగే కొలీగ్‌ల కంటే తాము అధికం సమయం పనిచేస్తున్నామని నాన్ స్మోకర్లు ఫిర్యాదు చేయడంతో వారికి వేతనంతో కూడిన అదనపు సెలవును పియాలా ఇంక్ అనే మార్కెటింగ్ కంపెనీ ప్రకటించింది. పొగతాగే అలవాటును మానివేసేందుకు తాము ప్రకటించిన ఇన్సెంటివ్ ఉపకరిస్తుందని కంపెనీ సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. పొగతాగే అలవాటును మాన్పించేందుకు, పొగతాగేవారికి వ్యతిరేకంగా కఠిన నిబంధనలను జపాన్ ఇటీవల ప్రవేశపెట్టింది. 2020 వేసవి ఒలింపిక్‌ల నేపథ్యంలో జపాన్ నగరాలను స్మోక్ ఫ్రీ సిటీస్‌గా మార్చాలని అధికార యంత్రాగం భావిస్తోంది. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఈ దిశగా ఇటీవల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. -
ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే!
వాషింగ్టన్ : తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్ స్మోకింగ్ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ కేర్ సెంటర్లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు. -
పొగరాయుళ్ల నుంచి రూ.1.7 కోట్లు వసూలు
బెంగళూరు : బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుట నిషేధం. బస్సులో పొగ తాగరాదు అంటూ ప్రతి ఆర్టీసీ బస్సులో దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉంటారు. నిబంధనలు అతిక్రమించి పబ్లిక్ ప్రాంతమైన బస్సు స్టేషన్లలో స్మోకింగ్ చేసిన వారికి జరిమానా విధించేలా కర్ణాటక రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చేపట్టిన యాంటీ-స్మోకింగ్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. జరిమానా కింద మొత్తం రూ.1.7 కోట్లను కేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు 85,143 మంది ప్రయాణికులపై కేఎస్ఆర్టీసీ జరిమానా విధించింది. 2013-14 నుంచి 2014-15కు బస్సులో పొగతాగే వారి సంఖ్య పెరిగినా.. ఈ జరిమానాలతో 2015-16కు స్మోకింగ్ చేసే వారి తగ్గినట్టు కేఎస్ఆర్టీసీ పేర్కొంది. సిగరేట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల యాక్ట్ 2003 కింద బస్సు స్టేషన్లో స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి కేఎస్ఆర్టీసీ రూ.200 జరిమానా విధిస్తోంది. దీంతో ఈ ప్రజారవాణా సంస్థకు ఊహించకుండానే రూ.1.70 కోట్ల ఆర్థిక సాయం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 150 కేఎస్ఆర్టీసీ బస్సు స్టేషన్లలో ప్రయాణికులు స్మోకింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవ్ కేవలం రెవెన్యూలు ఆర్జించడమే కాకుండా, ప్రజల్లో స్మోకింగ్ వల్ల కలిగే ఆరోగ్యసమస్యలపై అవగాహన తెప్పిస్తున్నామన్నారు. -
పొగరాయుళ్లకు జరిమానా
కోవెలకుంట్ల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో శనివారం పొగతాగుతున్న ఐదుగురికి రూ. 500 జరిమానా విధించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అలాగే స్థానిక జమ్మలమగుడు చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించి ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్‌లేని 22 మంది వాహన చోదకులకు రూ. 2400 జరిమానా వేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
స్మోకర్స్.. అతి పెద్ద కోరిక ఏంటో తెలుసా...?
స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది తప్ప, తగ్గే ప్రసక్తే లేదు. ధూమపానంపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలో జరిగాయి. స్మోకింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అసలు ఎందుకు స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాలో చాలా రకాలుగా సర్వేల ద్వారా వివరించారు. నేడు ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రస్తుతం మహిళలు, పురుషులతో పోటీ పడి మరీ సిగరెట్లు కాలుస్తున్నారు. ఈ అలవాటు పెరుగుతున్న వారిలో మహిళల వృద్ధిరేటే అధికంగా ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, అలా వెళ్లి ఓ సిగరెట్ వెలిగించి నాలుగు పఫ్ లు లాగితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని ధూమపాన ప్రియులు భావిస్తారట. అలాంటి సమయాల్లో అదే అత్యుత్తం అని తోటివారికి చెబుతుంటారు. అంతేకాదు, ఓ అసక్తికర విషయాన్ని స్మోకర్స్ చెప్పడం తరచూ వింటూనే ఉంటాం. వీరిలో చాలా మంది ఈ అలవాటుగా దురలవాటుకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు, ఎంత త్వరగా వీలైతే అప్పుడు హాబిట్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్న విషయాన్ని చెబుతుంటారు. ఇదే వారికి ఉన్న అతి పెద్ద కోరిక అని వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు ఆట పట్టిస్తారు. భారత్ లో ప్రతిఏటా పోగాకు సంబంధిత కారకాల వల్ల 10 లక్షల మంది చనిపోతున్నారు. పోగాకు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఇది ఎన్నో రకాల క్యాన్సర్ లకు తెరిచిన తలుపుగా ఉంటుందట. పాసివ్ స్మోకింగ్ గురించి అవగాహన లేకపోవడంతో కూడా ఈ అలవాటు మానేసే వారి సంఖ్య తగ్గడం లేదని విశ్లేషకులు చెబుతుండగా, ఇంట్లో భార్య, పిల్లలు లేని సమయాల్లో(బయటి ప్రదేశాల్లో) సిగరెట్ తాగుతున్నాం కదా కొందరు స్మోకర్స్ వాదిస్తుంటారని మరికొందరు చెబుతున్నారు. -
ఒక్క ఎస్సెమ్మెస్‌తో ఆ అలవాటు పోతుందట!
న్యూయార్క్: ఒక పనిని ఒక రోజు చేసి వదిలేస్తే అది అవసరం.. అదే పని మరో రోజు కూడా చేస్తే అలవాటు.. అదే అలవాటు విడిచిపెట్టకుండా కొనసాగిస్తే బానిసత్వం. ఈ రోజుల్లో అవసరాల రీత్యా వ్యక్తికి బానిసత్వం తప్పదుగానీ.. అతడి అలవాట్లలో ఈ లక్షణం ఉండకూడదు. అది చెడు అలవాట్లలో అయితే.. ఇంకా డేంజర్. అందుకే వ్యక్తికి ఉండే చెడుఅలవాట్లలో ఒకటైన ధూమపానం గురించి తెగ హెచ్చరికలు చేస్తుంటారు. ప్రసార మాధ్యమాలన్నింటిని ఉపయోగిస్తుంటారు. భారత దేశంలోని ఏ మూలన సినిమాకు వెళ్లినా తొలుత మనకు దర్శనం ఇచ్చేది 'ఈ నగరానికి ఏమైంది..' అంటూ వచ్చే ప్రకటన. అయితే, పొగరాయుళ్లను మార్చేందుకు అంతపెద్ద శ్రమ కూడా అవసరం లేదని.. వారికి కాస్తంత చైతన్యం ఇచ్చేలా కొన్నికొన్ని సంక్షిప్త సమాచారాలను(ఎస్సెమ్మెస్) ఫోన్ ద్వారా పంపిస్తే ఇట్టే మారిపోతారని అధ్యయన కారులు చెబుతున్నారు. 'నువ్వు చేయగలవు' 'ధృడంగా ఉండు'వంటి ఎస్సెమ్మెస్‌లు చేయడం ద్వారా పొగతాగే అలవాటున్న వ్యక్తులకు ఆ అలవాటును పూర్తిగా మాన్పించవచ్చంట. అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనకారులు ఈ సర్వే నిర్వహించారు. ఎవరెవరు పొగతాగుతున్నారో వారి వివరాలు తెలుసుకొని వారికి ఒక వ్యవస్థ ద్వారా ప్రత్యేక ఎస్సెమ్మెస్‌లు పంపిస్తే వారిలో ఆ ఆలోచన తగ్గించవచ్చని ఆ అధ్యయనం వివరించింది. -
‘పొగ’తో వయసుకు ‘సెగ’
అతిగా మద్యం తాగినా అదే సమస్య వాషింగ్టన్: ధూమపానం... మద్యం వంటి అలవాట్లు ఉన్నవారికి ఇది చేదు వార్తే. పొగ తాగినా... అతిగా ‘పెగ్గు’ బిగించినా ముందుగానే వృద్ధాప్యపు లక్షణాలు వచ్చేస్తాయట! అయితే రోజుకు ఒకటి, రెండు పెగ్గుల మద్యం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదట. పైగా ఆరోగ్యకరం కూడా అంటోంది ఓ సరికొత్త అధ్యయనం. డీఎన్ఏలో జన్యుపరమైన మార్పులు జరిగి శరీరంపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. అయితే ఏ స్థాయిలో ధూమపానమైనా జీవసంబంధ మార్పులకు కారణమవుతుందని అధ్యయనం చేసిన అమెరికా అయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్త రాబర్ట్ ఎ ఫిల్బెర్ట్ పేర్కొన్నారు. బాల్టిమోర్‌లో ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్ వార్షిక సమావేశంలో ఈ అధ్యయన పత్రాలను సమర్పించారు. -
పొగరాయుళ్లకు డయాబెటిస్ రిస్క్..
పొగతాగని వారితో పోలిస్తే పొగరాయుళ్లకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరడం వల్ల డయాబెటిస్తో పాటు గుండె జబ్బులు, పక్షవాతం సోకే అవకాశాలు పెరుగుతాయని, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు తలెత్తుతాయని భారత్‌లోని మధుమేహ అధ్యయన సంస్థ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు పొగతాగే అలవాటు మానుకోకుంటే, మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
స్మోకర్ల అనారోగ్యం బాధ్యత సిగరెట్ కంపెనీలదే
ధూమపాన ప్రియుల చెవులలో తేనెలూరే వార్త ఇది. ఏళ్లపాటు దమ్ముమీద దమ్ము లాగి.. గుండె, ఊపిరితిత్తులూ, రక్తనాళాల్లో పొగచూరుకుపోయి.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారినపడినా ఏం ఫర్వాలేదిప్పుడు! ఎందుకంటే స్మోకర్ల అనారోగ్యానికి ఆయా సిగరెట్ కంపెనీలదే పూర్తి బాధ్యత. అలా ఇప్పటివరకూ ఆరోగ్యం చెడిపోయిన వారికి నష్టపరిహారంగా రూ.750 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఏ కోర్టు? ఏమిటా ఆదేశాలు? అంటారా.. కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ కోర్టు సోమవారం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. సిగరెట్లు తాగడం వ్యసనంగా మారిందని, దానివల్ల తమ ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించాయని, ఇందుకు సిగరెట్లు తయారుచేసిన కంపెనీలదే బాధ్యత అని ఆరోపిస్తూ 1998లో కొద్ది మంది స్మోకర్లు కోర్టుకెక్కారు. 17 ఏళ్ల తర్వాత ఇటీవలే ఆ కేసును విచారించిన కోర్టు.. ప్రఖ్యాత ఇంపీరియల్ టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్ డోనాల్డ్ టొబాకో కంపెనీలను నిందార్హమైనవిగా పేర్కొంది. బాధితులకు 12 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. అలా ఎలా సాధ్యమైందంటే.. ప్రస్తుతం మనదేశంలో అమలవుతున్నట్లు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేధిత ఆజ్ఞలేవీ కెనడాలో లేవు. పొగతాగడం హాని కరం అనే హెచ్చరికలు జారీ చేయకపోవడం కంపెనీల బాధ్యత అని, అలా చేయనందుకే ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. -
పొగబాబులకు పొగ
సిగరెట్ల ధరకు 25 శాతం పెంపు గుట్కాలు, కూల్‌డ్రింక్స్ తదితరాలపైనా బాదుడు మొబైల్స్ ధరలకూ రెక్కలు? న్యూఢిల్లీ: ధూమపాన ప్రియుల జేబులకు ఇకపై మరింతగా చిల్లు పడనుంది! సిగరెట్లపై విత్త మంత్రి అరుణ్ జైట్లీ భారీగా వడ్డించారు మరి! వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తాజా బడ్జెట్లో 11 శాతం నుంచి ఏకంగా 72 శాతానికి పెంచారాయన. 65 మిల్లీమీటర్ల పొడవుకు మించని సిగరెట్లకు ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇతర సిగరెట్లపైనా సుంకం 21 శాతానికి పెరిగింది. సిగార్లు, చుట్టలు తదితరాలపైనా సుంకాన్ని పెంచారు. మొత్తంమీద సిగరెట్ల ధర సగటున 25 శాతం పెరిగింది! పాన్ మసాలాపైనా ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12% నుంచి 16 శాతానికి పెంచారు. ముడి పొగాకుపై 50 % నుంచి 55 శాతానికి; గుట్కాలు, నమిలే పొగాకు ఉత్పత్తులపై 60 శాతం నుంచి 70 శాతానికి సుంకం పెరిగింది. ఈ చర్యలను శారీరక, ఆర్థిక ఆరోగ్య కోణం నుంచి చూడాలన్న జైట్లీ.. వీటిని అందరూ స్వాగతిస్తారని ఆకాంక్షించారు. అలాగే శీతల పానీయాలపై కూడా ఎక్సైజ్ సుంకాన్ని 5 శాతం పెంచారు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై విద్యా సెస్ విధించాలని బడ్జెట్లో ప్రతిపాదించిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లతో పాటు మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారం కన్పిస్తోంది. వాటి ధరలు 8 శాతం దాకా పెరగవచ్చని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే కంప్యూటర్లకు కూడా ఈ పెంపు తప్పకపోవచ్చు. దీనిపై మొబైల్ పరిశ్రమ నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ తయారీ భారత్ వెలుపలే జరుగుతున్నందున అన్ని ఫోన్ల ధరలూ 7-8 శాతం పెరగవచ్చని గ్రేహౌండ్ సీఈఓ సంచిత్ వీర్ గోగియా అభిప్రాయపడగా, అలాంటిదేమీ ఉండకపోవచ్చని లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ హరి ఓం రాయ్ చెప్పుకొచ్చారు. ఆన్లైన్, మొబైల్ ప్రకటనలు మరింత భారం కానున్నాయి. ఇకపై అవి కూడా సేవా పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే వార్తా పత్రికల్లోని ప్రకటనలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రేడియో టాక్సీ సేవలపై కూడా పన్ను భారం పెంచారు. దాంతో వాటి చార్జీలు కూడా రెంట్ ఎ టాక్సీ చార్జీలకు సమానం కానున్నాయి. పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలకు సీవీ సుంకం మినహాయింపును ఎత్తేశారు. దాంతో వాటి ధరలు పెరగనున్నాయి. కట్ చేసిన, పాలిష్డ్ వజ్రాలు, జెమ్స్టోన్స్పై కస్టమ్స్ సుంకం 2 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఉన్న విరిగిన, హాఫ్ కట్ వజ్రాలకు 2.5 శాతం సుంకం వడ్డించారు.