పొగబాబులకు పొగ
-
సిగరెట్ల ధరకు 25 శాతం పెంపు
-
గుట్కాలు, కూల్‌డ్రింక్స్ తదితరాలపైనా బాదుడు
-
మొబైల్స్ ధరలకూ రెక్కలు?
న్యూఢిల్లీ: ధూమపాన ప్రియుల జేబులకు ఇకపై మరింతగా చిల్లు పడనుంది! సిగరెట్లపై విత్త మంత్రి అరుణ్ జైట్లీ భారీగా వడ్డించారు మరి! వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తాజా బడ్జెట్‌లో 11 శాతం నుంచి ఏకంగా 72 శాతానికి పెంచారాయన. 65 మిల్లీమీటర్ల పొడవుకు మించని సిగరెట్లకు ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇతర సిగరెట్లపైనా సుంకం 21 శాతానికి పెరిగింది. సిగార్లు, చుట్టలు తదితరాలపైనా సుంకాన్ని పెంచారు. మొత్తంమీద సిగరెట్ల ధర సగటున 25 శాతం పెరిగింది! పాన్ మసాలాపైనా ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12% నుంచి 16 శాతానికి పెంచారు. ముడి పొగాకుపై 50 % నుంచి 55 శాతానికి; గుట్కాలు, నమిలే పొగాకు ఉత్పత్తులపై 60 శాతం నుంచి 70 శాతానికి సుంకం పెరిగింది. ఈ చర్యలను శారీరక, ఆర్థిక ఆరోగ్య కోణం నుంచి చూడాలన్న జైట్లీ.. వీటిని అందరూ స్వాగతిస్తారని ఆకాంక్షించారు. అలాగే శీతల పానీయాలపై కూడా ఎక్సైజ్ సుంకాన్ని 5 శాతం పెంచారు.
అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై విద్యా సెస్ విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లతో పాటు మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారం కన్పిస్తోంది. వాటి ధరలు 8 శాతం దాకా పెరగవచ్చని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే కంప్యూటర్లకు కూడా ఈ పెంపు తప్పకపోవచ్చు. దీనిపై మొబైల్ పరిశ్రమ నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ తయారీ భారత్ వెలుపలే జరుగుతున్నందున అన్ని ఫోన్ల ధరలూ 7-8 శాతం పెరగవచ్చని గ్రేహౌండ్ సీఈఓ సంచిత్ వీర్ గోగియా అభిప్రాయపడగా, అలాంటిదేమీ ఉండకపోవచ్చని లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ హరి ఓం రాయ్ చెప్పుకొచ్చారు.
-
ఆన్‌లైన్, మొబైల్ ప్రకటనలు మరింత భారం కానున్నాయి. ఇకపై అవి కూడా సేవా పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే వార్తా పత్రికల్లోని ప్రకటనలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
-
రేడియో టాక్సీ సేవలపై కూడా పన్ను భారం పెంచారు. దాంతో వాటి చార్జీలు కూడా రెంట్ ఎ టాక్సీ చార్జీలకు సమానం కానున్నాయి.
-
పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలకు సీవీ సుంకం మినహాయింపును ఎత్తేశారు. దాంతో వాటి ధరలు పెరగనున్నాయి.
-
కట్ చేసిన, పాలిష్డ్ వజ్రాలు, జెమ్‌స్టోన్స్‌పై కస్టమ్స్ సుంకం 2 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఉన్న విరిగిన, హాఫ్ కట్ వజ్రాలకు 2.5 శాతం సుంకం వడ్డించారు.