
కొంతమంది చాలా సుదీర్ఘకాలం నుంచి పొగతాగుతూ ఉంటారు. ఇలాంటివారిని ‘క్రానిక్ స్మోకర్స్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎందుకు, ఎలా వస్తాయో చూద్దాం. కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. స్మోకింగ్ కోసం తరచూ లైటర్ లేదా అగ్గిపుల్ల ఉపయోగించి, ఆ మంటను నోటి దగ్గరికి తీసుకెళ్లినప్పుడల్లా అది కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంది. అలా మాటిమాటికీ ఆ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య కూడా వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్‌లాగానో, నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేయాలి. ఆ తరవాత వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మన చూపును పోగొట్టి దృష్టిదోషాలు తెచ్చే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం చాలా మంచిది.
Comments
Please login to add a commentAdd a comment