నేనూ పరీక్ష రాస్తున్నానోచ్ అంటున్న నరేంద్ర మోడీ
గుజరాత్ లో గురువారం నుంచి పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బుధవారం ఉన్నట్టుండి ఒక ఎస్ ఎం ఎస్ వచ్చింది.
'విద్యార్ధి మిత్రులారా... నేను నరేంద్ర మోడీని,' అంటూ నరేంద్ర మోడీ వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తరువాతే మోడీ మార్కు మొదలైంది. 'మీలా నేనూ పరీక్షలు రాస్తున్నాను. నేను పరీక్షలంటే భయపడటం లేదు. నాలాగే మీరూ పరీక్షలంటే భయపడకండి' అంటూ భరోసా ఇచ్చారు. 'పరీక్షలు ఎదుర్కోవడం జీవితంలో సహజం. మనం ఎంత కష్టపడి ప్రిపేరైతే అంత విజయం సాధిస్తాం. మీ టీచర్లు, మీ తల్లిదండ్రులు మీ కోసం ఎంతో చేశారు. వీటన్నిటి వల్ల మీరు విజయం సాధించడం ఖాయం' అంటూ మోడీ సెంటిమెంట్ పై దెబ్బకొట్టారు.
రాబోయే లోకసభ ఎన్నికలే నరేంద్ర మోడీ రాయబోతున్న అసలైన పరీక్ష. మోడీకి కూడా దాటాల్సిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. పార్టీ లోపల, వెలుపల సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటి కన్నా ముఖ్యం ప్రజల ఆమోదాన్ని పొందాలి. అది సిసలైన పరీక్ష. ఇన్ని కఠిన పరీక్షల ముందు మీ పరీక్షలొక లెక్కా అన్నట్టు నరేంద్ర మోడీ విద్యార్థుల్లో భరోసా నింపారు.
తమాషా ఏమిటంటే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఒక సారి ఫెయిలయినా మరో చాన్స్ ఉంటుంది. కానీ మోడీకి ఇదే మొదటి, చివరి పరీక్ష. ఇందులో ఫెయిలయితే మాత్రం అంతే సంగతులు.