సేవ్ ద పవర్
- గ్రేటర్‌లో విద్యుత్ పొదుపునకు శ్రీకారం
- ఏసీలు బంద్
- హోర్డింగ్‌లకు రాత్రి 7 నుంచి 10 గంటల వరకే లైట్లు
- త్వరలో నగరమంతా ఎల్‌ఈడీ లైట్లు
- వీధి దీపాలకు 60 మెగావాట్ల నుంచి 24 మెగావాట్లకు తగ్గనున్న విద్యుత్ వాడకం
- ప్రజలకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా విజ్ఞప్తి
- రైతుల కోసమే విద్యుత్ పొదుపు మంత్రం అంటున్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ... నగరంలో విద్యుత్ పొదుపు పాటించేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. విద్యుత్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్న తరుణంలో వీలైనంత వరకు తమ పరిధిలో విద్యుత్ ఆదా చర్యలకు సిద్ధమైంది. అవసరమున్న మేరకే విద్యుత్‌ను వినియోగించాలని వివిధ యాజమాన్యాలకు సూచించింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోనూ, హోర్డిం గ్‌లు, వీధిదీపాల్లోనూ విద్యుత్ ఆదా చర్యలకు శ్రీకారం చుట్టింది.
కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కనీసం రానున్న 15 రోజులపాటు విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సోమవారం ఆయా వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రకటనల సంస్థలు, హోటళ్లు, ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దిగువ నిర్ణయాలను అమలు చేయాలని కోరారు.
ఖరీఫ్ పంట దిగుబడికి రానున్న రెండు వారాలు అత్యంత కీలకమైనందున 15 రోజులపాటు విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించాలి.
షాపింగ్‌మాల్స్, హోర్డింగులు, వాణిజ్యసంస్థలు, సినిమా థియేటర్లలో విద్యుత్ దుబారా తగ్గించాలి. ఏసీలు, అధిక విద్యుత్ వినియోగమయ్యే లైట్లు వాడొద్దు. హోర్డింగులకు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకే లైట్లు వాడాలి.
మూడు నెలల్లో నగరమంతటా ఎల్‌ఈడీలు..
ప్రస్తుతం కొన్ని మార్గాల్లో ఏర్పాటు చేసిన 748 ఎల్‌ఈడీ లైట్లతో దాదాపు 60 శాతం వరకు విద్యుత్
ఆదా అవుతున్నట్లు తెలిసింది. నగరమంతా వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో విద్యుత్ ఆదా కానుంది. ఈ మేరకు మూడునెలల్లోగా నగరంలోని అన్ని మార్గాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు చర్యలు. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో త్వరలోనే అమలు. ప్రస్తుతం నగరంలో ఉన్న దాదాపు 3.50 లక్షల వీధిదీపాలకు 59 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. ఎల్‌ఈడీ లైట్లతో ఇది 24 మెగావాట్లకు తగ్గుతుంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే వీధిదీపాలు వెలిగేందుకు కేంద్రీకృత విధానం. కంప్యూటరీకరణ ద్వారా ఆన్ /ఆఫ్‌కు చర్యలు.
హోర్డింగ్‌లకూ ఎల్‌ఈడీ తప్పనిసరి
ఇకపై అనుమతినివ్వబోయే హోర్డింగ్‌లకు, లైట్లను వాడే ప్రకటనలకూ ఎల్‌ఈడీలనే వాడాలనే నిబంధన అమలు చేస్తారు. వాడని పక్షంలో అనుమతులివ్వరు. పాతవాటి రెన్యూవల్స్ చేయించుకోవాలన్నా ఇదే విధానం వర్తిస్తుంది.
జీహెచ్‌ఎంసీ నుంచే తొలి అడుగు
జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఉన్నతాధికారులు విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించాలన్నారు. తమ వద్ద ఫోన్ నెంబర్లున్న 10 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదార్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కరెంటు ఆదాపై విజ్ఞప్తి చేస్తామన్నారు. కరపత్రాల ద్వారానూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామన్నారు. విద్యుత్‌ను ఆదా చేయడమంటే.. ఒకరకంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమేనని చెప్పారు. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.నాగరాజు స్పందిస్తూ, తెలంగాణలోని అన్ని హోటళ్ల యాజమాన్యాలకూ ఈమేకు విజ్ఞప్తి చేస్తామని, నగ రంలోని హోటళ్లలో దీనిని అమలు చేసి మిగతావారికి ఆదర్శప్రాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు.