- నిలిచిపోయిన మరో కన్వర్టరు
- రెండు వారాలు ఉత్పత్తికి విఘాతం
విశాఖపట్నం: విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్టీల్ మెల్ట్ షాప్-2లోని కన్వర్టర్-1 కూడా మరమ్మత్తులకు గురి కావడంతో విభాగంలో ఉత్పత్తి నిలిచిపోయింది. 13రోజుల పాటు ఉత్పత్తికి అంతరాయం కలగనున్నది. దీని ప్రభావం వల్ల విభాగం వార్షిక లక్ష్యాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. వారం రోజుల క్రితం విభాగంకు చెందిన కన్వర్టర్-2కు రంధ్రం పడటంతో ఆ కన్వర్టర్ నిలిచిపోయిన విషయం విదితమే.
ఒక్క కన్వర్టర్‌తో ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి కన్వర్టర్‌కు చెందిన షెల్ హీట్ పెరిగిపోవడం గమనించారు. రిఫ్రాక్టరీ లైనింగ్ పాడైందని గుర్తించి దానిని మరమ్మతులకు అందించారు. విభాగం కన్వర్టర్లకు అవసరమైన రిఫ్రాక్టరీ బ్రిక్స్ సరఫరా లేకపోవడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తినట్టు సమాచారం. రెండో కన్వర్టర్‌కు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తికావడానికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది.
విభాగంలో రెండు కన్వర్టర్లు ఉండగా కేవలం ఒక కన్వర్టర్‌కు సరిపడా రిఫ్రాక్టరీ మెటీరియల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రెండో కన్వర్టర్‌కు చెందిన లైనింగ్‌ను మొదటి కన్వర్టర్‌కు అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ను సకాలంలో సరఫరా చేయకపోవడం, యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.