
అమెరికా దిగుమతి సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం మార్పులకు లోనుకానుందని సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాశ్ పేర్కొన్నారు. యూఎస్‌లో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదన్నారు. సుంకాల నేపథ్యంలో భారత్‌కు చౌక స్టీల్ దిగుమతుల ముప్పు ఎదురుకావొచ్చని చెప్పారు. అన్ని స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను యూఎస్ ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ నెల 2 నుంచి అన్ని రకాల దిగుమతులపైనా ప్రతీకార సుంకాల విధింపును ప్రకటించడం గమనార్హం.
‘సంప్రదాయంగా స్టీల్ ఆసియా దేశాల నుంచి యూఎస్, యూరప్‌కు ఎగుమతి అవుతుంటుంది. కొంత స్టీల్ యూరప్ నుంచి యూఎస్‌కు వెళుతుంటుంది. ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ఆయా ఎగుమతులు లాభసాటి కావు. దాంతో యూరప్‌కు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఎగుమతి చేసే స్టీల్ ప్రపంచ దేశాలను ముంచెత్తుతుంది. ఇది భారత్‌కు కూడా రావొచ్చు’ అని సెయిల్ ఛైర్మన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికాకు భారత్ స్టీల్ ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో టారిఫ్‌ల ప్రభావం మనపై తక్కువే ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
‘అమెరికాలో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదు. దీంతో తాము ఉత్పత్తి చేయలేని వాటి దిగుమతులను అమెరికా కొనసాగిస్తుంది. అక్కడ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటుంది’ అని వివరించారు. దేశీ స్టీల్ పరిశ్రమను చౌక దిగుమతుల నుంచి కాపాడేందుకు సుంకాల విధింపు అవసరమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సేఫ్‌గార్డ్ డ్యూటీని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ గత నెలలో సిఫారసు చేయడం గమనార్హం. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.