బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు
పాట్నా: మావోయిస్టులు తమ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసులకు, ప్రభుత్వాలకు మరిన్ని సవాళ్లు రువ్వుతున్నారు. తాజాగా.. బీహార్‌లో ఈ నెల 10న జరగనున్న తొలిదశ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ ఆరు నియోజకవర్గాల్లోన్ని ప్రజల మొబైళ్లకు భారీ సంఖ్యలో(బల్క్) సంక్షిప్త సందేశాలు పంపారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అవినాష్ పేరిట వచ్చిన ఈ ఎస్‌ఎంఎస్‌లలో పోలీసులు సహా పోలింగ్ సిబ్బందికి సైతం మావోలు హెచ్చరికలు జారీచేశారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సమయాల్లో మావోలు వాల్ పోస్టర్లు, కరపత్రాలు లేదా ప్రకటనల రూపంలో హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే.
తాజాగా ఇప్పుడు మొబైల్ సందేశాల రూపంలో నక్సల్స్ హెచ్చరికలు జారీ చేయడం మాత్రం దేశంలో ఇదే తొలిసారి. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన బీహార్ పోలీసు యంత్రాంగం ఎస్‌ఎంఎస్‌ల పనిపట్టేందుకు నడుం బిగించింది. బీహార్ డీజీపీ అభయానంద్ వెల్లడించిన వివరాలు..
ళీ బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత గయ, నవాడా, జముయి, ఔరంగాబాద్, ససారాం, కరాకట్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ ఆయా నియోజకవర్గాల ప్రజలకు మావోలు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపారు. సాధారణ ప్రజలు సహా రైతులు, కార్మికులు, మేధావులు, దేశ భక్తులు, విప్లవ కారులు అందరూ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరించారు. అంతేకాకుండా మావోయిస్టు గెరిల్లా దళాలు ఎన్నికలు జరిగే రోజు దాడులకు దిగనున్నట్టు తెలిపారు. ఎన్నికల సిబ్బంది సదరు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని పోలీసు వాహనాల్లో ప్రయాణించ రాదని హెచ్చరించారు. కాగా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలూ చేపడతామని డీజీపీ చెప్పారు. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ దాదాపు 48 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపడంతోపాటు, హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.
ప్రజలకు నక్సల్స్ ఎస్‌ఎంఎస్‌లు
Published Thu, Apr 3 2014 3:21 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement