ఎస్‌ఎంఎస్ వస్తే రేషన్ బియ్యం వచ్చినట్టే | Ration beneficiaries mobile phones SMS information | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంఎస్ వస్తే రేషన్ బియ్యం వచ్చినట్టే

Published Sun, Mar 8 2015 12:13 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

Ration beneficiaries mobile phones SMS information

లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తాం
 వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అమలు
 రేషన్‌బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం
 వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి
 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’
 జిల్లా జాయింట్ కలెక్టర్. డా.ఎన్.సత్యనారాయణ

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆహారభద్రత కింద మీ కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ప్రభుత్వం ఇస్తోందా? ఆ బియ్యం మీ రేషన్ షాపుకు ఎప్పుడు వస్తాయో మీకు తెలియదు కదా..! ఒకటి, రెండుసార్లు షాపుకు వెళ్లి లేదంటే డీలర్‌ను కలిసి అడిగితేనే మీకు రేషన్ బియ్యం వ చ్చిందో లేదో తెలుస్తుంది. కానీ వచ్చే నెల నుంచి అలాంటి అవసరం లేదు. మీ రేషన్ డీలర్ వద్దకు మీ కోటా బియ్యం రాగానే మీ మొబైల్‌ఫోన్ మోగుతుంది. మీ డీలర్ వద్దకు బియ్యం వచ్చాయి.. తీసుకెళ్లండి అని మీ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్) వస్తుంది. మన జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ఎస్‌ఎంఎస్ సమాచారాన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తామంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ. రేషన్‌బియ్యం సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు గాను పలు మార్గాలను అన్వేషిస్తున్నామని, అందులోభాగంగానే ఈ ఎస్‌ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాలో నిత్యాసవరాల పంపిణీ, వంటగ్యాస్‌కు నగదు బదిలీ, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువపత్రాల మంజూరు లాంటి విషయాలపై శనివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి....

 సాక్షి: జిల్లాలో నిత్యావసరాల పంపిణీ ఎలా ఉంది? ఈ పంపిణీలో జరుగుతున్న అవకతవకలను ఎలా అరికట్టాలనుకుంటున్నారు?
  జేసీ: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యాన్ని డీలర్ల ద్వారా అందిస్తున్నాం. ఇతర వస్తువులు పంపిణీ చేసేందుకు కూడా ప్రతినెలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అయితే, కొన్ని చోట్ల ఈ పంపిణీ సక్రమంగా లేదనే ఫిర్యాదులు మాకు కూడా వస్తుంటాయి. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పంపిణీలో మార్పులు చేస్తుంటాం. అందులో భాగంగానే జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సమాచారాన్ని చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నాం. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే దీనిని అమలు చేశారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా వచ్చే నెల నుంచి మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని షాపుల్లో రేషన్ తీసుకునే లబ్ధిదారులకు ఈ ఎస్‌ఎంఎస్ సౌకర్యం కల్పిస్తాం. రేషన్ డీలర్‌వద్దకు బియ్యం రాగానే లబ్ధిదారుల మొబైల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ పెడతాం. తద్వారా రేషన్ సరుకులు లబ్ధిదారుడు సకాలంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దుర్వినియోగానికి అవకాశం ఉండదు.
 
 సాక్షి: మనిషికి ఆరుకిలోల బియ్యం ఇస్తే అవి దుర్వినియోగం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయా?
 జేసీ: ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. అయితే, ఈ బియ్యాన్ని చాలా మంది తినడం లేదని, అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. చట్టం ప్రకారం అయితే రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా కేసులు పెడతాం. బియ్యాన్ని పెద్ద మొత్తంలో సైకిల్‌పై తీసుకెళ్లినా ఆ సైకిల్‌ను కూడా సీజ్ చేయవచ్చని చట్టం చెబుతోంది. రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేయవద్దని ఊర్లలో టాంటాం వేయిస్తున్నాం. ఈ మేరకు తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సూచనలు పంపాం. అదే విధంగా ఆరుకిలోల చొప్పున ఇచ్చేందుకు గాను డీలర్లు స్టాక్‌పెట్టుకునే స్థలం లేక ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రెండు సార్లు బియ్యం తీసుకెళతామని అంటున్నా దానిని అంగీకరించే ప్రసక్తే లేదు. ఒక షాపునకు కేటాయించిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఒకేసారి తీసుకెళ్లాలి. దానిని నిల్వచేసి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత డీలర్‌దే. ఈవిషయంలో తేడా వస్తే చర్యలు తీసుకుంటాం.
 
 సాక్షి: ఆహారభద్రత కార్డులు ఎప్పుడొస్తాయి? ఈనెల కూడా కూపన్ల ద్వారానే రేషన్ ఇస్తారా?
 జేసీ: ఆహారభద్రత కార్డుల జారీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం లేదు. కార్డులు వచ్చేంతవరకు కూపన్లు ఇచ్చాం. అయితే, ఈనెల మాత్రం కీరిజస్టర్ ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చాం. కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశిస్తే పంపిణీ చేసేందుకు మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ కార్డులు వచ్చిన తర్వాతే రేషన్‌షాపుల క్ర మబద్ధీకరణ చేపడతాం.
 
 సాక్షి: వంటగ్యాస్‌కు నగదు బదిలీ ఎంత వరకు వచ్చింది?
 జేసీ: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వంటగ్యాస్‌కు నగదుబదిలీ ఏప్రిల్1 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందుకోసం జిల్లాలోని 90శాతం మంది వినియోగదారులను వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేశాం. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. అటు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల వద్ద ఆధార్‌సీడింగ్ వేగంగా జరుగుతోంది. అయితే, గ్యాస్‌ఏజెన్సీలు ఈ విషయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వ్యక్తిగత బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాంకర్లను అప్రమత్తం చేస్తున్నాం. వంటగ్యాస్‌కు ఆధార్‌సీడింగ్‌లో సమస్యలుంటే 18004251442 టోల్‌ఫ్రీనంబర్‌కు ఫోన్‌చేసి చెప్పవచ్చు.
 
 సాక్షి: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పరిస్థితి ఏంటి?
 జేసీ: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. ఇందుకు సంబంధించి 125 గజాల్లోపు భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 15వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిని పరిశీలిస్తే 12వేలకు పైగా దరఖాస్తులు సక్రమంగా లేవు. ఈ భూములు అసైన్డ్, శిఖం, ఎఫ్‌టీఎల్, మున్సిపల్, పార్కులు, రోడ్ల సరిహద్దులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని మినహాయించి మరో 2,500 దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. 59 జీఓ కింద వచ్చిన 1815 దరఖాస్తులకు గాను దరఖాస్తుదారులు మార్కెట్ ధరలో 25శాతం చెల్లించడం ద్వారా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం.
 
 సాక్షి: రెవెన్యూ కార్యాలయాల్లో విద్యార్థులకు ధ్రువపత్రాల మంజూరులో ఏమైనా మార్పులు తెస్తున్నారా?
 జేసీ: విద్యాసంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు, సెట్‌లకు హాజరయ్యేందుకు, పోటీపరీక్షల్లో పాల్గొనేందుకు గాను విద్యార్థులకు అనేక ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఇందుకోసం ఈ ఏడాది కొత్త విధానాన్ని తీసుకువస్తున్నాం. ‘విద్యార్థికి రెవెన్యూ నేస్తం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలను వారి వారి పాఠశాలలకే పంపిస్తున్నాం. ఇందుకోసం ఈనెల తొమ్మిదిన తహశీల్దార్లు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం.
 
 ఈ సమావేశాల్లో ఇచ్చే ఫార్మాట్ల ప్రకారం ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లోని 5 నుంచి 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆయా విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలను పాఠశాలలకు తీసుకెళ్తారు. తొలివిడతలో భాగంగా వచ్చే నెల మొదటివారంలోపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ద్రువపత్రాలిస్తాం. పాఠశాలలు తెరిచిన తర్వాత 6,7,8,9 తరగతుల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తాం. తద్వారా ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరం ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement