సంక్షిప్తంగా.. ఉచితంగా..
► కొత్తపుంతలు తొక్కుతున్న సమాచార వ్యవస్థ
► మాటల కంటే ఎస్‌ఎంఎస్, మెసేజ్‌లకు ప్రాధాన్యం
► ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్న ప్రజలు
► జిల్లాలో నెలకు రూ.2 కోట్లు విలువైన ఎస్‌ఎంఎస్‌ల వినియోగం
తణుకు : క్రిస్మస్.. నూతన సంవత్సరం.. సంక్రాంతి.. దసరా.. దీపావళి.. ఏ పండగైనా.. ఏ శుభకార్యమైనా సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుకోవడం పరిపాటి. రోజురోజుకీ మారిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేవారు. కాలక్రమేణా అవన్నీ కాలగర్భంలోకి కలిసిపోయూరుు. అంతకుముందు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం పంపాలంటే ఫోన్ చేయడం లేదా ఉత్తరాలు రాసుకునేవారు.
ఇప్పుడు స్కూల్‌కు పిల్లలు వెళ్లకపోయినా.. మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు వచ్చినా.. ఏదైనా సమావేశం జరుగుతున్నా.. ఇలా ప్రతి సందర్భంలో ఎస్‌ఎంఎస్‌లు (సంక్షిప్త సందేశాలు) అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయాలంటే ఉత్తరం తర్వాత ల్యాండ్ ఫోన్ ఇప్పుడు సెల్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం ఎస్‌ఎంఎస్‌లు కీలకంగా మారుతున్నాయి.
వాటిలో ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, మెసెంజర్ వంటి యాప్‌లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చిన తొలినాళ్లలో అధిక శాతం సంభాషణలకే ఉపయోగిస్తే ఇప్పుడు మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్... అంటూ కేవలం సంక్షిప్త సందేశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అన్నీ ఉచితమే
ఎస్‌ఎంఎస్‌లు కేవలం సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా నెట్ ద్వారా కొన్ని వెబ్‌సైట్లలోకి వెళ్లి సమాచారాన్ని పంపవచ్చు. తరచూ ఎవరికైతే మెసేజ్‌లు పంపుతున్నామో ఆయా నంబర్లను నెట్‌లో నిక్షిప్తం చేసుకుని తర్వాత రోజుకు వంద చొప్పున ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానం ఎక్కువగా విద్యాసంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు వినియోగిస్తున్నాయి.
మరోవైపు కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చిన వాట్సప్ ద్వారా నెట్ అందుబాటులో ఉంటే అపరిమితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే వీలు కలిగింది. ఆయా నెట్‌వర్క్ కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ఆధారంగా ఆయా కంపెనీల ద్వారా జిల్లాలో సుమారు 40 లక్షల మంది సెల్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఆయా నెట్‌వర్క్ కంపెనీలు ఎస్‌ఎంఎస్‌ల కోసం వినియోగదారులకు వివిధ ఆఫర్లు అందజేస్తున్నారు. మొత్తమ్మీద వీరంతా నెలకు రూ. 2 కోట్లు విలువ చేసే ఎస్‌ఎంఎస్‌లు
వినియోగిస్తున్నారు.
సాంకేతికతను వినియోగించుకుంటున్నాం
గతంలో స్నేహితులతో మాట్లాడాలంటే సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు యాంత్రిక జీవనంలో మాట్లాడాలంటే కష్టమవుతోంది. దీంతో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ ఎస్‌ఎంఎస్‌లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. శుభాకాంక్షలు తెలపాలన్నా, సమాచారం చేరవేయాలన్నా సమయం వృథా కాకుండా ఇవి తోడ్పడుతున్నాయి.
- టి.శివశంకర్, తణుకు