ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ ఉండేలా ప్రణాళిక
ఈ దిశగా చర్యలు వేగవంతం చేసిన కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగం
ఇప్పటికే పలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపిన కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.
ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్‌లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ట్రేడ్‌లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్‌లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment