విసుగొచ్చేదాకా మాట్లాడించే కృత్రిమ మేధ చాట్‌బాట్
మాటలతో మభ్యపెట్టి యూజర్ల డేటాను కాపాడే ప్లాన్
కొత్తగా ఆవిష్కరించిన బ్రిటిష్ టెలికం
కంపెనీ వర్జిన్ మీడియా ఓ2
ఎలా పనిచేస్తుంది?
వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్‌లోకి సంభాషణను మళ్లిస్తుంది.
‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది.
అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.
కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో...
మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్‌లైన్‌లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment