ఆన్‌లైన్ నేరాల కట్టడిపై కేంద్రం దృష్టి
ఏఐ పరిశోధనలకు మరింత ఊతం
వాటికి బడ్జెట్లో రూ.1,550 కోట్లు
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్‌వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే.
గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది.
సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్‌లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం!
సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు.
మహిళలు, చిన్నారుల రక్షణకు..
మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్‌లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు.
ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు
కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్‌లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్‌పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.
ఫిర్యాదుల వరద...
భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్ మోసాలే! మన దేశంలో ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.
మన కంపెనీలే లక్ష్యం
కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్‌లైన్‌లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment