
నవ వధువు ఆత్మహత్య
సూసైడ్ నోట్‌లో అత్త, బావల పేర్లు
రాయచూరురూరల్(కర్ణాటక): ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టిన నవ వధువుకు కొద్ది రోజుల్లోనే వేధింపులు ఎదురయ్యాయి. అందంగా లేవని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది.
గదగ్ బేటిగేరిలోని శరణ బసవేశ్వర కాలనీకి చెందిన అమరేష్‌కు బళ్లారికి చెందిన పూజాతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. భర్త అమరేష్ యాదగరి జిల్లా శహపురలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే ఇతర ప్రాంతానికి బదలీ చేశారు. కొద్ది రోజలు పాటు బేటిగేరిలోనే ఉండాలని, అనంతరం బదిలీ అయిన ప్రాంతానికి తీసుకెళ్తాని భర్త చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం ఆమెకు అత్తింటిలో వేధింపులు మొదలయ్యాయి.
అందంగా లేవని, వంటలు సరిగా చేయడం లేదని అత్త శశికళ, బావ వీరన గౌడలు సూటిపోటిమాటలతో మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించేవారు. ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పగా కొద్ది రోజులు సర్దుకొని వెళ్లాలని సూచించారు. అయితే వేధింపులు ఎక్కువ కావడంతో పూజా ఈనెల 15న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అత్త శశికళ, బావ వీరన గౌడ వేధించినట్లు అందులో ఉండటంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు.