అమెరికాలో చాట్‌బాట్ యాప్‌పై కేసు వేసిన ఓ తల్లి
సీటీఆర్‌ఎల్.. యువతపై కృత్రిమ మేధ ప్రభావాన్ని తెరపై ఆవిష్కరించిన సినిమా.
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది.
పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి
14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్‌ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు.
చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు.
గూగుల్‌పై దావా
ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది.
‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్‌క్లైమర్‌ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?.
ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment