spam
-
రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం ఎస్ఎంఎస్లలో రెండు శాతం స్పామ్ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్‌ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్‌లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సరీ్వస్కి సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్‌బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్–డిస్టర్బ్ని (డీఎన్డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్‌ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది. మిగతా వివరాల్లోకి వెళ్తే.. → ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. ఎస్ఎంఎస్లపరంగా (టెక్ట్స్ మెసేజీలు) గుజరాత్, కోల్‌కతా, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఈ స్థానాల్లో ఉన్నాయి. → 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్‌తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. → స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్ కాల్స్‌లో 22 శాతం కాల్స్.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి. → పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి. -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్
భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన యాంటీ స్పామ్ టెక్నాలజీ (ఏఎస్టీ) సంచలనం సృష్టిస్తోందని టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఏఎస్టీ వినియోగంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కంపెనీ 100 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లను హెచ్చరించింది. స్పామ్ కాల్, ఎస్ఎంఎస్ను విశ్లేషించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. 2 మిల్లీ సెకన్లలో ఈ సొల్యూషన్ 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12.2 కోట్ల స్పామ్ కాల్స్, 23 లక్షల స్పామ్ సందేశాలను గుర్తించినట్టు ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిల్ సీఈవో శివన్ భార్గవ తెలిపారు. కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక వల్ల స్పామ్ కాల్స్ 97 శాతం, స్పామ్ ఎస్ఎంఎస్లు 99.5 శాతం తగ్గాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏఎస్టీ కచ్చితత్వం 97 శాతం ఉందన్నారు.ఇదీ చదవండి: కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణస్పామ్ కాల్స్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని శివన్ భార్గవ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా స్పామ్ కాల్స్ కారణంగా ఏడాదిలో 3 బిలియన్ డాలర్ల(రూ.25 వేలకోట్లు) విలువైన బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్–జులై మధ్య భారత్‌లో రూ.1,720 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సైబర్ మోసాలపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్సీఆర్పీ) రోజూ సుమారు 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దేశంలో 60 శాతం మంది మొబైల్ యూజర్లకు రోజులో కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 87 శాతం మంది అవాంచిత ఎస్ఎంఎస్లు అందుకుంటున్నారు. స్పామ్ ముప్పునకు పరిష్కారం కోసం ఏడాదిగా శ్రమించి ఏఎస్టీని సొంతంగా అభివృద్ధి చేశాం. 100 మందికిపైగా డేటా సైంటిస్టులు నిమగ్నమయ్యారు’ అని వివరించారు. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్మిట్ చేయండి. -
బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. అక్టోబర్ నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతను త్వరలో వినియోగించనుంది. ‘ఈ టెక్నాలజీ తుది దశలో ఉంది. స్పామ్లు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, తటస్థీకరించి, తొలగించడానికి ఇది రూపొందింది’ అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 15–18 మధ్య జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ పరిష్కారాన్ని బీఎస్ఎన్ఎల్ పరిచయం చేయనుంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించే టెక్నాలజీని ఈ నెల 25న ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న అయాచిత వాణిజ్య సమాచార మార్పిడి ముప్పును అరికట్టడానికి టెల్కోలు కఠిన చర్యలు తీసుకోవాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్‌ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్‌ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్‌హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్‌ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్‌లను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్
ఇబ్బందికర కాల్స్, నమోదుకాని టెలిమార్కెటర్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఉక్కుపాదం మోపుతోంది. ట్రాయ్ ఆదేశాలతో 2.75 లక్షల ఫోన్ నంబర్లను టెలికాం సంస్థలు డిస్కనెక్ట్ చేశాయి. నమోదుకాని 50 టెలిమార్కెటింగ్ కంపెనీలకు చెందిన టెలికాం సేవలను బ్లాక్ చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.ఈ చర్యలు స్పామ్ కాల్స్‌ను తగ్గించడంలో, కస్టమర్లకు ఉపశమనం కలిగించడంలో గణనీయ ప్రభావాన్ని చూపుతాయని ట్రాయ్ భావిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ వల్ల 2024 ప్రథమార్థంలో నమోదుకాని టెలిమార్కెటర్లపై 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. ఇబ్బందికర కాల్స్‌ను కట్టడి చేసేందుకు ట్రాయ్ 2024 ఆగస్ట్ 13న అన్ని యాక్సెస్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేసింది. టెలికాలం వనరులను దుర్వినియోగం చేస్తున్న నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ వాయిస్ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని, రెండేళ్ల వరకు డిస్కనెక్షన్ లేదా బ్లాక్ లిస్టులో పెట్టాలని యాక్సెస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇబ్బంది కలిగించే కాల్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా..50కి మించిన కాల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపే నిర్దిష్ట నంబర్‌కు గ్రేడ్స్ ప్రకారం అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఇటీవలే తన చర్చా పత్రం ద్వారా టెలికాం కంపెనీలకు సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే! -
సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!అయాచిత స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్ బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
స్పామ్ కాల్స్ టెలీమార్కెటర్లను బ్లాక్‌లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ చేసే టెలీమార్కెటర్లపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన చర్యలు ప్రకటించింది. అన్‌రిజిస్టర్డ్ టెలీ మార్కెటింగ్ సంస్థలు వ్యాపారపరమైన స్పామ్ కాల్స్ చేస్తున్నట్లుగా తేలినట్లయితే వాటి టెలికం వనరులన్నింటినీ డిస్కనెక్ట్ చేయాలని, రెండేళ్ల పాటు వాటిని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని టెల్కోలను ఆదేశించింది. బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినప్పుడు ఆయా సంస్థలకు కొత్తగా టెలికం వనరులను కేటాయించరాదని పేర్కొంది.ఎస్ఐపీ, పీఆర్ఐ వంటి టెలికం వనరులను ఉపయోగిస్తున్న అన్‌రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లు ఈ ఆదేశాలు వచ్చిన నెల రోజుల్లోగా డీఎల్టీ ప్లాట్‌ఫాంనకు మారాలని తెలిపింది. ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై ప్రతి పదిహేను రోజులకు ఓసారి (ప్రతి నెలా ఒకటి, పదహారో తారీఖుల్లో) అప్డేట్ ఇవ్వాలని టెల్కోలకు ట్రాయ్ సూచించింది. ఈ ‘నిర్ణయాత్మక చర్య‘తో స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గగలదని, వినియోగదారులకు ఉపశమనం కలగగలదని అభిప్రాయపడింది. -
అవాంఛిత కాల్స్ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్‌లైన్ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజిస్టర్డ్ మార్కెటర్లు ప్రైవేట్ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. -
స్పామ్ కాల్స్‌తో ఒళ్లు మండిపోతోందా? ఇలా చేయండి!
పొద్దున లేచింది మొదలు రాత్రి వరకూ స్పామ్ కాల్స్ బెడద ఇంతా అంతాకాదు. ఏ పనిలో ఉన్నా,ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా.. ఏదో పెద్ద పని ఉన్నట్టు మనల్ని డిస్ట్రబ్ చేస్తాయి. తీరా అది స్పామ్ అని తెలిసాక మన కొచ్చే కోపం అంతా కాదు. సెలెన్స్ అన్ నోన్ కాలర్స్, స్పామ్ కాల్ అలర్ట్.. ఇలా ఎన్ని అప్షన్స్ ఉన్నా.. ఎన్ని నంబర్లను బ్లాక్ చేసినామళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి..దాదాపు సెల్‌ఫోన్ ఉన్నప్రతి వారికి ఇది అనుభవమే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక వీడియో తెగ షేర్ అవుతోంది. How do you deal with unwanted telephone calls? pic.twitter.com/emVHvdv02N — Science girl (@gunsnrosesgirl3) March 31, 2024 సైన్స్గర్ల్ అనే ట్విటర్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. ఈవీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే ఇది 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి! -
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడానికి కొత్త యాప్
టెక్నాలజీ పెరిగిపోతున్న సమయంలో ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. అనవసరమైన కాల్స్, మెసేజ్‌లకు స్వస్తి పలకడానికి 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) ఓ కొత్త యాప్ తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ యాప్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. అయితే ఇందులో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల దీనిని వినియోగించడంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాయ్ కార్యదర్శి 'రఘునందన్' వెల్లడించారు. ట్రాయ్ డెవెలప్ చేసిన డు నాట్ డిస్టర్బ్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం అవాంఛిత కాల్స్ లేదా మెసేజ్‌లను పూర్తిగా నిషేధించడమే. ఈ యాప్ సాయంతో వినియోగదారులు తమకు ఇబ్బందికరమైన కమ్యూనికేషన్లను సులభంగా నివేదించవచ్చు, పూర్తిగా నిరోధించవచ్చు. యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై రఘునందన్ మాట్లాడుతూ.. యాప్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించడానికి ట్రాయ్ ఇప్పటికే ఏజెన్సీని నియమించింది, దీంతో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. 2024 నాటికి ఇందులో ఎలాంటి సమస్యలు లేకుండా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఐఫోన్లలో యాపిల్ పరిమితుల కారణంగా ఈ యాప్ పనిచేసే అవకాశం లేదు. రానున్న రోజుల్లో ఈ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు ప్రతి రోజూ సుమారు 5 మిలియన్స్ కంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నాయని, వీటి భారీ నుంచి విముక్తి చేయడానికి ట్రాయ్ ఈ యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. 'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి. -
ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా!
ఇటీవల ఇండోనేషియా (+62), వియత్నాం (+84), మలేషియా (+60), కెన్యా (+254), ఇథియోపియా (+251).. మొదలైన దేశాల నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ఫోన్‌కాల్స్‌ను తమకు తెలియకుండా అప్రయత్నంగా.. అనుకోకుండా రిసీవ్ చేసుకుంటూ ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు చాలా మంది. ఈ సైబర్‌నేరగాళ్ల నుంచి జాగ్రత్తపడటమే కాదు మన తోటివారికీ అవగాహన కలిగించడం అవసరం. ఆఫీసుకువెళ్లే హడావిడిలో ఫోన్ మోగితే లిఫ్ట్ చేసింది గీత. ఒక లార్జ్ గ్రూప్ ద్వారా ఆన్లైన్ ఆదాయ వనరులను పరిచయం చేయబోతున్నామని, అందుకు సంబంధించిన వివరాలను ఫోన్‌కి పంపుతున్నామని చెప్పారు కాలర్. అందుకు ఎన్ని లెవల్స్ ఉంటాయో, ఎలా పాల్గొనవచ్చో కూడా చెప్పిన విధానం గీతకు బాగా నచ్చింది. ముందు ఫ్రీ టాస్క్‌లో పాల్గొని, అంతా నచ్చితే కొనసాగించమని, అందుకు సంబంధించిన వివరాల మెసేజ్‌ను పంపుతామని, చెక్ చేసుకోమని, గ్యారంటీ ్రపాఫిట్ అని చెప్పడంతో గీతకు ఆనందమేసింది. ఆఫీసుకు వెళ్లాక ఫోన్‌కి వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసింది. గ్రూప్‌లో జాయినవమని వచ్చిన మెసేజ్ అది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయింది. చాలా మంది ఉన్న ఆ గ్రూప్‌లో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని అర్ధమైంది. ఆ గ్రూప్‌లో చూపించిన విధంగా తన అకౌంట్‌కి లాగిన్ అయి, ఫ్రీ టాస్క్‌లో చేరితే వెంటనే తన అకౌంట్లోకి రూ.500 వచ్చాయి. ఆనందపడుతూ వాళ్లు చెప్పిన టాస్క్‌ని పూర్తి చేస్తే, మరో రూ.1000 జమ అయ్యాయి. వాటిని విత్ డ్రా చేసుకున్నాక, పెయిడ్ టాస్క్‌కు వెళ్లి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాక కానీ, అర్ధం కాలేదు గీతకు తను మోసపోయానని. విదేశీ మోసగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఫేక్ లైక్స్.. డీపీ లు మొత్తం ఇండియన్ అమ్మాయిల ఫొటోలు ఉంటాయి. కానీ, ఫేక్‌ప్రొఫైల్స్ ఉంటాయి. మనవాళ్లే కదా అని జాయిన్ అవుతాం. వాయిస్ కూడా మన ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లైక్స్, యూ ట్యూబ్ వ్యూస్...పెంచడం కోసం ఒక టాస్క్ ఉంటుంది. ముందు ఫ్రీ టాస్క్‌ల పేరుతో ఆకట్టుకుంటారు. మనకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ గేమ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిజమైన ప్లేయర్లతో పాటు స్కామర్లు కూడా ఉంటారు. రూ. 500 వచ్చాయని, రూ.1000 వచ్చాయని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తుంటారు. కొంత టైమ్ అయ్యాక ఫ్రీ టాస్క్ పూర్తయిందని, పెయిట్ టాస్క్ ఉందని చెబుతారు. వీటిలో మళ్లీ రకరకాల గ్రూప్స్‌లో మనల్ని యాడ్ చేస్తారు. రూ.1000 పెడితే 1300 ఇస్తాడు. వెంటనే 300 రావడంతో ఆశ పెరుగుతుంది. 5000 పెడితే మరో 2000 అదనంగా వస్తాయని చూపుతారు. ప్రతీ టాస్క్ పై ఒత్తిడితో కూడా ప్రెజర్ ఉంటుంది.రూ. 7000 మన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసేలోపు టైమ్ లాప్స్ అయిపోయిందని చెబుతారు. దీనిని డ్రా చేయాలంటే రూ. 10000 పెట్టమంటారు. ఇవన్నీ మల్టిపుల్ అకౌంట్స్ , ఇండియన్ అడ్రస్ ఉన్న ప్రైవేట్ బ్యాంకుల ఖాతాలు చూపుతారు. మనం నిజమే కదా అని నమ్మి వాళ్ల ట్రాప్‌లో పడతాం. అప్పుడు మెల్ల మెల్లగా రూ.50 నుంచి మొదలు పెట్టి పది లక్షల వరకు రూట్ మార్చుతుంటారు. ఇరవై రోజుల క్రితం 20 లక్షలు వరకు జరిగిన మోసం నిన్న 60 లక్షల రూపాయలతో సైబర్ క్రైమ్‌లో కేస్ నమోదైంది. స్పామ్ కాల్స్‌కి ఆన్సర్ చేయద్దు ♦ తెలియని ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్‌ని నమ్మద్దు. ఈ కాల్స్ వచ్చినప్పుడు అపనమ్మకంగానే కాదు అప్రమత్తంగానూ ఉండడటం అవసరం. ♦ కాలర్ ఐడెంటిటినీ వెరిఫై చేసుకోవాలి. ♦ ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి వ్యక్తిగత వివరాలను కాలర్స్‌కి ఇవ్వద్దు. ♦ స్పామ్ కాల్స్‌ని రిసీవ్ చేసుకోవద్దు. అలాంటి వాటిని ట్రూ కాలర్‌లో చెక్ చేసుకోండి. ♦ వాట్సప్, టెలిగ్రామ్, ట్రూ కాలర్‌లో అనుమానించదగిన ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు ఆ యాప్స్‌కి రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఒక సింగిల్ స్టెప్ ద్వారా యూజర్ రిపోర్ట్ చేయచ్చు. ♦ ఏ కాలర్ కూడా మనల్ని డబ్బు కట్టమని అడగరు. ఇలాంటప్పుడు గ్రూప్‌లో నుంచి ఎగ్జిట్ అవడం లేదా హ్యాంగప్ చేయాలి. ♦ ఏం చేస్తారో చూద్దాం అనుకొని గ్రూప్‌లో కొందరు ఎగ్జిట్ అవక అలాగే ఉండిపోతారు. అలాంటివాళ్లే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మోసపోతారు. గ్రూప్‌లో అలాగే ఉండి మిగతా మెంబర్లు ‘మాకు డబ్బులు వచ్చాయి’ అని షేర్ చేసే, స్క్రీన్ షాట్లకు పడిపోవద్దు. మోసపోతే.. ♦ 1930కి కాల్ చేయాలి. ♦హెల్ప్‌లైన్ వాళ్లు మోసపోయిన ఆధారాల డాక్యుమెంట్స్ ఇవ్వమంటారు. ♦ మోసగాళ్లు మల్టిపుల్ అకౌంట్స్‌ను ఉపయోగిస్తుంటారు. మన ద్వారా వాటికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయిస్తారు. వాటి ఆధారంగా ఆయా రోజుల్లో మన ఖాతాలో నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయో, మన ఖాతాకు ఎవరి ద్వారా డబ్బు వచ్చిందో చూసి ఆ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు కేస్ ఫైల్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి, మన డబ్బులు మనకు వచ్చేలా చేస్తారు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల,డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
చిర్రెత్తిస్తున్న స్పామ్ కాల్స్
సాక్షి, అమరావతి: అర్జంట్ పనిలో ఉన్నపుడు అదేపనిగా ఫోన్ మోగుతూ ఉంటుంది. అంత పనిలోనూ ఫోన్ ఎత్తితే.. తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామనో, తక్కువ రేటుకే ఇంటి స్థలం అంటూనో.. అవతలి నుంచి గొంతు వినిపిస్తుంది. ఆ మాట వినగానే ఫోన్ వినియోగదారుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ స్పామ్ కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా వేధిస్తోంది. యూజర్లను కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, ఈ–మెయిళ్లతో కూడా చికాకు పెడుతున్నారు. మన దేశంలో ఎక్కువ మందికి రోజులో మూడు అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నట్టు లోకల్ సర్వే నివేదిక చెబుతోంది. ఇలాంటి కాల్స్‌ను 40 శాతం మంది బ్లాక్/డిస్కనెక్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. కేవలం 2 శాతం మంది మాత్రమే స్పామ్ కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు వివరించింది. ఈ స్పామ్ కాలర్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పదేపదే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. 2007లో డునాట్డిస్టర్బ్ (డీఎన్డీ) సదుపాయా న్ని తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టడానికి టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) ఫ్రేమ్‌వర్క్‌ను 2010లో ట్రాయ్ ప్రవేశపెట్టింది. వీటిని యాక్టివేషన్ చేసుకున్నప్పటికీ 95 శాతం మంది తిరిగి స్పామ్కాల్స్ను ఎదుర్కొన్నట్టు సర్వే గుర్తించింది. స్పామ్బాట్లో రెండో స్థానం.. లండన్‌కు చెందిన స్పామ్, సైబర్ బెదిరింపులను ట్రాక్ చేసే సంస్థ ‘స్పామ్హాస్ ప్రాజెక్ట్’ నివేదిక ప్రకారం చైనా తర్వాత భారత దేశంలోనే అత్యధికంగా స్పామ్బాట్లను వినియోగిస్తున్నా రు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్పామ్ కాల్స్, మెసేజ్‌లను పంపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పామ్బాట్ను వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భారత్‌లో దాదాపు 9.39 లక్షల స్పామ్బాట్లు చురుగ్గా ఉన్నట్టు అంచనా. వీటిని ప్రధానంగా ఫిషింగ్, క్లిక్–ఫ్రాడ్, డీడీఓఎస్ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. రష్యాలో అధికంగా స్పామ్ ఈ–మెయిళ్లు స్పామ్, ఫిషింగ్ తాజా నివేదిక ప్రకారం 2022లో రష్యా (29.8 శాతం), చైనా (14శాతం), అమెరికా (10.7 శాతం) స్పామ్ ఈ–మెయిళ్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా స్పెయిన్‌లో 8.8 శాతం, తర్వాత రష్యాలో 7.3 శాతం హానికరమైన ఈ–మెయిళ్లను బ్లాక్ చేశారు. భార త్లో స్పామ్ మెయిళ్ల వాటా 1.8 శాతంగా ఉంటే.. బ్లాక్ చేసిన ఈ–మెయిళ్లు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య.. స్పామ్కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా మారింది. అర్జెంటీనాలో ఫోన్ కాల్స్‌లో అత్యధికంగా 52 శాతం స్పామ్‌కాల్స్ నమోదవుతున్నట్టు గుర్తి ంచారు. భారత్‌లో ఆ వాటా 12.7 శాతంగా ఉంది. ఇక ఐర్లాండ్, హంగేరీ, థాయ్‌లాండ్ దేశాలు స్పామ్ కాల్ ముప్పు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో 10 శాతం లోపే స్పామ్ కాల్స్ నమోదవుతున్నాయి. -
వాటమ్మా.. వాట్సాప్ ‘స్పామ్’మ్మా
ఆఫీస్‌లోనో.. ఇంట్లోనో పనిలో నిమగ్నమై ఉండగా వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు మెసేజ్ పంపారో.. ఏంటోనని పని ఆపేసి మరీ చూస్తే.. ‘ఫలానా షోరూమ్‌లో పండుగ ఆఫర్ ఉంది. త్వరగా షాపింగ్ చేయండి. ఆఫర్ వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి’ అనే మెసేజ్ కనిపిస్తుంది. అలాంటివి చూడగానే చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి మెసేజ్‌లు దేశంలోని వాట్సాప్ వినియోగదారుల్లో 95 శాతం మందిని విసిగిస్తున్నాయి. రోజుకు కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్‌లు వాట్సాప్ వస్తున్నాయి. ‘లోకల్ సర్కిల్’ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలియని నంబర్ల నుంచి వస్తున్న ఇలాంటి మెసేజ్‌లపై దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో 51 వేల మంది వాట్సాప్ వినియోగదారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. వీటిల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు వంటివి ఉంటున్నట్లు తేలింది. ఇలా చేయండి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన వాట్సాప్‌కు అభ్యంతరకర, అసభ్యమైన మెసేజ్‌లు పంపినా.. పదేపదే స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నా సంబంధిత కాంటాక్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం వాట్సాప్‌లో ఉంది. ఇలా చేస్తే వాట్సాప్ ఫిర్యాదుల బృందానికి రిపోర్ట్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఒకే కాంటాక్ట్‌పై ఎక్కువ రిపోర్ట్లు నమోదైతే ఆ కాంటాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
‘డు నాట్ డిస్టర్బ్’ అన్నా తప్పని బెడద: కీలక సర్వే
న్యూఢిల్లీ: ‘డు నాట్ డిస్టర్బ్’ లిస్టులో నమోదు చేసుకున్నప్పటికీ మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఏకంగా 92 శాతం సబ్స్క్రయిబర్స్కు రోజుకు కనీసం 1 కాల్ అయినా అలాంటిది వస్తోంది. ఆన్లైన్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థల నుంచి తమకు అత్యధికంగా అవాంఛిత కాల్స్ వస్తున్నాయని 78 శాతం మంది వెల్లడించారు. మొత్తం 11,157 మంది ఇందుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వగా వారిలో 66 శాతం మంది తమకు రోజుకు సగటున 3 లేదా అంతకు మించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు 96 శాతం మంది తమకు అటువంటి కాల్ ఏదో ఒకటి ప్రతి రోజూ వస్తూనే ఉంటుందని వివరించారు. ఇక 16 శాతం మంది తమకు రోజుకు సగటున 6 10 కాల్స్ వస్తుంటాయని చెప్పగా 5 శాతం మంది 10 పైగా అవాంఛిత ఫోన్స్ వస్తుంటాయని వివరించారు. -
మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్!
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్ఏపీ అమల్లోకి వస్తే కాల్ చేసే వారి పేరు మొబైల్ ఫోన్లలో డిస్ప్లే అవుతుంది. తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ స్పామ్ వంటి యాప్‌లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్‌లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. చదవండి: డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! -
ఈలాన్‌మస్క్ వర్సెస్ పరాగ్.. ట్విటర్లో ముదురుతున్న వివాదం
Elon Musk Vs Parag Agrawal: ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రావాల్ ప్రపంచ కుబేరుడు ఈలాన్మస్క్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఆది నుంచి ట్విటర్ మేనేజ్మెంట్పై విమర్శలు, విసుర్లతో విరుచుకుపడుతున్నాడు ఈలాన్ మస్క్. అలా వ్యవహరిస్తూనే ఏకమొత్తంగా ట్విటర్ కొనుగోలుకు ముందుకు వచ్చాడు. రేపో మాపో ట్విటర్ ఈలాన్ మస్క్ సొంతమవుతుందని తెలిసినా ప్రస్తుత ఈసీవో పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవంటూ ఆ సంస్థ మేనేజ్మెంట్ చెప్పిన వివరాలపై ఈలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో స్పస్టత రాని పక్షంలో ట్విటర్‌ను టేకోవర్ చేసే విషయం పునరాలోచించుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చిరకాలు జారీ చేశాడు. ట్విటర్ కొనుగోలు డీల్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్టు ఈలాన్ మస్క్ ప్రకటించినా పరాగ్ అగ్రవాల్ వెనక్కి తగ్గడం లేదు. తమ టీమ్ ఫేక్/స్పాన్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తుందని చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లను సృష్టించేది మనిషో/ లేక యంత్రమో కాదు. ఈ రెండు కలిసి అధునాతన పద్దతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులుజిత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. మా శాయశక్తుల వాటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని ఫేక్ అకౌంట్ల నిగ్గు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ పరాగ్ అగర్వాల్ తేల్చి చెప్పాడు. Let’s talk about spam. And let’s do so with the benefit of data, facts, and context… — Parag Agrawal (@paraga) May 16, 2022 ట్విటర్లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయనేది నిర్థారించేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ అనేక ట్వీట్లు చేశాడు పరాగ్ అగ్రవాల్. అయితే వాటన్నింటికి వ్యంగంగా కామెడీ చేసే ఓ ఈమోజీని రిప్లైగా ఇస్తూ మరింత వెటకారం చేశారు ఈలాన్ మస్క్. పరాగ్ అగ్రవాల్, ఈలాన్ మస్క్ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విటర్ కనుక పారదర్శకంగా ఉండాలనుకుంటే స్పామ్ అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలంటున్నారు చాలా మంది. మరికొందరు ట్విటర్ సీఈవోను ఈలాన్ మస్క్ దారుణంగా అవమానిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు -
ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఎలన్ మస్క్
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లోనే ఓ పోస్ట్ చేశారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn — Elon Musk (@elonmusk) May 13, 2022 ఈ ప్రకటనతో మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్ నిలిపివేతపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టగా.. ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్ మస్క్ ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్‌ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది. -
ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే ఇక అంతే!
Cyber Crime Prevention Tips- మెయిల్ ఓపెన్ చేయగానే కొన్ని స్పామ్ మెయిల్స్ మనకు కనిపిస్తాయి. డిస్కౌంట్ అనో, బ్యాంక్ సిబిల్ స్కోర్ ఫ్రీ అనో, మరేవో ఆఫర్లు అనో.. ఇ– మెయిల్స్ ఊరిస్తుంటాయి. ఇవన్నీ వ్యాపార సంబంధమైనవిగా ఉంటాయి. పది మిలియన్ స్పామ్ మెయిల్స్ పంపడానికి కూడా పది పోస్టల్ సందేశాలు పంపడానికి అయ్యేంత ఖర్చు మాత్రమే అవుతుంది. దీంతో వ్యాపార సందేశాలు దాదాపుగా స్పామ్ మెయిల్స్‌ను ఎంచుకుంటుంటాయి. వీటికి ఆకర్షితులై, ఆ లింక్స్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారంటే మిమ్మల్ని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. స్పామ్ మెయిల్స్‌తో మీరే స్కామ్‌లో ఇరుక్కోవచ్చు. స్పామ్ నుంచి ప్రమాదం భారత జాతీయ న్యాయ చట్టంలో స్పామ్ గురించిన ప్రస్తావన లేదు. దీంతో వాక్‌స్వేచ్ఛను రక్షించాలనే విషయంలో, చట్టపరమైన పరిష్కారాలను అమలు చేయడంలో ఇది మరింత కష్టంగా మారుతోంది. అందుకే, మనమే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రోజన్ హార్స్: వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తాయి. నకిలీ లింక్‌లు, డౌన్‌లోడ్స్‌లో మారువేషంలో ఉండి తమ మోసపూరిత పనిని చక్కబెడుతుంటారు. జాంబీస్: మీ వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర కంప్యూటర్లను స్పామ్ చేసే సర్వర్‌గా మార్చేసుకుంటారు. ఫిషింగ్ : మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఫలితంగా గోప్యత, కీర్తి, డబ్బు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మధ్యవయస్కులు, రిటైర్మెంట్ బాధితులు ఎక్కువ ఉంటున్నారు. ఇంటర్నెట్ స్కామ్‌లు: మీరు కొంత బహుమతి రూపంలోనో, ఉద్యోగం, వివాహం, ప్రేమ.. గెలుచుకున్నట్లు ఇ–కామర్స్ చూపుతుంటాయి. తెలుసుకోవడం సులువు ►స్పామ్ మెయిల్స్ లేదా ఎస్సెమ్మెస్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తుంటాయి. దీనిని బట్టి అది నకిలీ మెయిల్ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. సాధారణంగా చిరునామా, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్ లేదా బ్యాంకింగ్ సంబంధిత సమాచారం వంటి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలేవీ ఇవ్వకూడదు. ►అనుమానాస్పద డొమైన్ పేరుతో అసాధారణమైన అక్షరాలను ఉపయోగిస్తారు. ►అనేక నకిలీ ఇ–మెయిల్లు ప్రభుత్వ అధికారులు, బ్యాంకింగ్ అధికారులు లేదా చట్టబద్ధమైన కంపెనీల నుండి, వ్యక్తుల నుండి వచ్చినట్టు చూపుతాయి.. ►మెసేజ్ సబ్జెక్ట్ లైన్న్లో ‘అత్యవసరం‘, ‘ప్రత్యుత్తరం‘, ‘అవకాశం‘, ‘తక్షణం‘, ‘ముగింపు తేదీ‘.. వంటి పదాలు ఇ–మెయిల్లో ప్రధానాంశాలుంగా ఉంటాయి. ►స్పామ్ ఇ–మెయిల్లో అక్షరదోషాలు ఉంటాయి. చాలా నకిలీ ఇ–మెయిల్లు ప్రాథమిక అక్షరదోషాలు, పేరు తప్పుగా రాయడం, పేలవమైన వ్యాకరణంతో ఉంటాయి. మోసపూరిత ఇ–మెయిల్ చిరునామా తెలిసినవారి ఇ–మెయిల్ చిరునామాకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. స్పామ్ అని గుర్తించడానికి.. అన్ని రకాల మెయిల్స్, అనేక ఇతర వ్యాపార ఇ–మెయిల్ కార్యకలాపాలు అంతర్నిర్మిత అల్గారిథమ్‌లను కలిగి ఉంటాయి. ఇవి స్పామ్, జంక్ మెయిల్లను స్పామ్ ఫోల్డర్లోకి తరలిస్తే ఫిల్టర్ అవుతాయి. మీ మెయిల్లో స్పామ్ ఇ–మెయిల్లు పుష్కలంగా వస్తున్నట్లు చూసినట్లయితే, మీరు వాటిని పై విధంగా ఫిల్టర్ ద్వారా వదిలించుకోవచ్చు. ►జిమెయిల్ స్పామ్‌ని క్లిక్ చేసి, ఆ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించండి. ఎఝ్చజీ∙కూడా అనుమానాస్పద ఇ–మెయిల్స్‌ను గుర్తిస్తుంది. స్పామ్ హెచ్చరిక లేబుల్‌లను రెడ్ మార్క్‌లో ఉంచుతుంది ► ఆపిల్ మెయిల్ రిపోర్ట్ స్పామ్లో ’గీ’ గుర్తు ఉన్న ట్రాష్ క్యాన్ (జంక్ మెయిల్) చిహ్నంపై క్లిక్ చేయాలి. ►యాహూ మెయిల్ స్పామ్ ఫోల్డర్లోకి ఇ–మెయిల్‌ను మాన్యువల్‌గా తరలించాలి. అప్పుడు యాహూ అనుమానాస్పద ఇ–మెయిల్లను గుర్తిస్తుంది. ఆ ఇ–మెయిల్లను డిఫాల్ట్ స్పామ్ ఫోల్డర్లో ఉంచుతుంది. ►మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ ఇ–మెయిల్‌కు ముందు చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, మెనూలోని జంక్ ఇ–మెయిల్ ఎంపికలపై క్లిక్ చేయాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.. ►మెయిల్ అకౌంట్‌కు కనెక్ట్ చేసిన ఫొటోలు, ఈవెంట్ల వివరాలు, ఇతర ఇ–మెయిల్ చిరునామాలు భద్రంగా ఉండటానికి భద్రతను చెక్ చేసుకోవాలి. మీ ఎంపికల ఆధారంగా ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి టాగిల్ స్విచ్‌లను అడ్జస్ట్ చేయాలి. వ్యక్తిగత సమాచారం, గోప్యతా సెట్టింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. ►అకౌంట్ సురక్షితంగా ఉండటానికి యాప్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవడంతో పాటు అవసరం లేనప్పుడు ఆఫ్‌లైన్‌లో ఉంచాలి. ►కంప్యూటర్ భద్రతా పద్ధతులను అమలు చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ కంప్యూటర్ను ఉపయోగించనప్పుడు ఇంటర్నెట్ నుండి డిస్కనెక్ట్ (లాగ్ ఆఫ్) చేయండి. ►ఏవైనా అనవసర లింక్‌లను ఓపెన్ చేయడం, మెయిల్ ద్వారా వచ్చిన ఫైల్లు లేదా లింక్‌లను డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అలాంటి మెయిల్స్‌ను ఓపెన్ చేయకపోవడమే శ్రేయస్కరం. ►అత్యంత విశ్వసనీయత గలవాటి నుంచే ఉచిత సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేయాలి. ఉచిత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే గేమ్‌లు, ఫైల్ షేరింగ్, స్కానర్లు ప్రోగ్రామ్‌లు, ఇతర అనుకూల ఉచిత వ్యాపార అప్లికేషన్లు .. మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►అవసరం లేని వాటిని ఇ మెయిల్ నుండి తీసివేయండి. ఎందుకంటే స్పామ్ మెయిల్స్ మధ్యలో మీరు మీ అతి ముఖ్యమైన ఇ–మెయిల్‌ను కోల్పోయే అవకాశం ఉంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..!
సుమారు 20.2 కోట్ల సార్లు కాల్స్..అందులో 6 లక్షల 64 వేల మంది బాధితులకు నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్ అది కూడా స్పామ్ కాల్(అవాంఛనీయ కాల్స్) అని స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ పేర్కొంది. స్పామ్ కాల్స్ వివరాలపై ట్రూకాలర్ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది. వార్షిక గ్లోబల్ స్పామ్ నివేదికలో పలు విషయాలును ట్రూకాలర్ బహిర్గతం చేసింది. ట్రూకాలర్ తన నివేదికలో వెల్లడించిన విషయాలు...! ►భారత్‌లో ఒక స్పామర్ సుమారు 202 మిలియన్లకు పైగా స్పామ్ కాల్లు చేసినట్లు కాలర్-ఐడెంటిఫికేషన్ సర్వీస్ ట్రూకాలర్ షేర్ చేసింది. ప్రతి గంటకు 27 వేల మందిని మొబైల్ వినియోగదారులకు చుక్కలు చూపించిందని ట్రూకాలర్ వెల్లడించింది. ►ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు యూజర్లు స్పామ్ కాల్ డేటాను ట్రూకాలర్ రిలీజ్ చేసింది. ►భారత్‌లో స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగాయని ట్రూకాలర్ నివేదిక హైలైట్ చేసింది. ►ప్రపంచంలో అత్యధికంగా స్పామ్ కాల్స్‌ను ఎదుర్కొన దేశాల్లో భారత్ 4 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 9 వ స్థానంలో నిలవడం గమనర్హం. బ్రెజిల్ అగ్రస్థానంలో నిలవగా..పెరూ రెండో స్థానంలో ఉంది. ►భారత్‌లోని మొబైల్ యూజర్లకు సరాసరి నెలకు వచ్చే స్పామ్ కాల్స్ సంఖ్య 16.8గా ఉంది. ►స్పామ్ కాల్స్‌లో పూర్తిగా 93 శాతానికి పైగా అమ్మకాలు లేదా టెలిమార్కెటింగ్ కోసం చేసినవేనని ట్రూకాలర్ నివేదిక పేర్కొంది. ►అక్టోబర్ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్ వెల్లడించింది. ►భారత్‌లో ఎక్కువగా కేవైసీ, ఓటీపీ వివరాలను చెప్పాలంటూ వచ్చే కాల్స్ ఎక్కువ స్పామ్ కాల్స్‌గా ఉన్నాయి. చదవండి: యూజర్ల డేటాను ఇతర సంస్థలకు అందిస్తోన్న ట్రూకాలర్..! -
వాట్సాప్‌లో ఇలా చేశారో..! మీ అకౌంట్‌ను మర్చిపోవాల్సిందే..!
Your Whatsapp Account Banned Or Deleted Did You Just Do This: వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. స్మార్ట్ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్ మనందరి నిత్యజీవితాల్లో ఒక భాగమైంది . అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే. చదవండి: Menstruation app: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు వాట్సాప్‌ను సరిగ్గా వాడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒకవేళ వాట్సాప్‌ను మిస్యూజ్ చేశామనుకోండి అంతే సంగతులు..! వాట్సాప్ యాప్‌ను మిస్యూజ్ చేస్తోన్న వారిపై వాట్సాప్ కఠినవైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 20 లక్షల ఇండియన్ ఖాతాలను వాట్సాప్ మూసివేసింది. వాట్సాప్ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేస్తుంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది. మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్ ఖాతా బ్లాక్...! థర్డ్ పార్టీ, లేదా మోడెడ్ వాట్సాప్ యాప్‌లను వాడకూడదు..! వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్ యాప్స్ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. స్పామ్ మెసేజ్‌లను పంపితే...! తెలియని నంబర్లకు స్పామ్మెసేజ్లను పంపితే వాట్సాప్ ఆయా యూజర్లను బ్లాక్ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్ చేస్తోంది. రెసిపెంట్ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్ చేస్తే మీ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతాయి. చదవండి: ఆగకుండా 1360 కిలోమీటర్ల ప్రయాణం..! టయోటా వరల్డ్ రికార్డు..! -
20 లక్షల ఖాతాలపై వాట్సప్ నిషేదం
న్యూఢిల్లీ: దేశంలో కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాట్సాప్ యాజమాన్యం నెలవారీ కాంప్లయన్స్ రిపోర్టును గురువారం విడుదల చేసింది. భారత్‌లో ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 వరకూ 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి 345 ఫిర్యాదులు అందాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. 50 లక్షలకుపైగా ఖాతాదారులున్న ప్రతి సోషల్ మీడియా, డిజిటల్ వేదిక ప్రతినెలా కాంప్లయన్స్ నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా తెలియజేయాలి. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాము నిషేధం విధించిన ఖాతాల్లో 95 శాతం ఖాతాలు అనధికార (స్పామ్) మెసేజ్‌లకు సంబంధించినవేనని తెలియజేసింది.