రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్‌ కాల్స్‌ | Airtel AI solution flags 8 billion spam calls in 2. 5 months | Sakshi
Sakshi News home page

రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్‌ కాల్స్‌

Published Tue, Dec 10 2024 12:46 AM | Last Updated on Tue, Dec 10 2024 7:55 AM

Airtel AI solution flags 8 billion spam calls in 2. 5 months

80 కోట్ల స్పామ్‌ మెసేజ్‌లు 

 ఏఐ సాఫ్ట్‌వేర్‌తో గుర్తించిన ఎయిర్‌టెల్‌ 

అత్యధిక స్పామ్‌ కాల్స్‌ జాబితాలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ: స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్‌ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది.

 తమ నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం కాల్స్‌లో ఆరు శాతం, మొత్తం ఎస్‌ఎంఎస్‌లలో రెండు శాతం స్పామ్‌ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్‌ కూడా అక్కడి నుంచే జనరేట్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్‌ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్‌ ప్రదేశ్‌ తర్వాత స్థానంలో ఉంది.
  
ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్‌టెల్‌ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్‌లైన్‌ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్‌ ఉంటున్నాయని వివరించింది. 

లావాదేవీలు, సరీ్వస్‌కి సంబంధించిన కాల్స్‌ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్‌బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్‌ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్‌–డిస్టర్బ్‌ని (డీఎన్‌డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్‌ కాల్స్‌ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్‌ వస్తాయని పేర్కొంది.  

మిగతా వివరాల్లోకి వెళ్తే.. 
→ ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్‌ కాల్స్‌ జనరేట్‌ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్‌ 3లో ఉన్నాయి. ఎస్‌ఎంఎస్‌లపరంగా (టెక్ట్స్‌ మెసేజీలు) గుజరాత్, కోల్‌కతా, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఈ స్థానాల్లో ఉన్నాయి.  
→ 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్‌ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్‌తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్‌ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్‌ కాల్స్‌ మాత్రమే వచ్చాయి. 
→ స్పామ్‌ కాల్స్‌ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్‌ కాల్స్‌లో 22 శాతం కాల్స్‌.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్‌ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి.  
→ పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్‌ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్‌ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement