భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన యాంటీ స్పామ్ టెక్నాలజీ (ఏఎస్‌టీ) సంచలనం సృష్టిస్తోందని టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఏఎస్‌టీ వినియోగంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కంపెనీ 100 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లను హెచ్చరించింది. స్పామ్ కాల్, ఎస్‌ఎంఎస్‌ను విశ్లేషించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. 2 మిల్లీ సెకన్లలో ఈ సొల్యూషన్ 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12.2 కోట్ల స్పామ్ కాల్స్, 23 లక్షల స్పామ్ సందేశాలను గుర్తించినట్టు ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిల్ సీఈవో శివన్ భార్గవ తెలిపారు. కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక వల్ల స్పామ్ కాల్స్ 97 శాతం, స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు 99.5 శాతం తగ్గాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల స్పామర్స్‌ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏఎస్‌టీ కచ్చితత్వం 97 శాతం ఉందన్నారు.
ఇదీ చదవండి: కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
స్పామ్ కాల్స్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని శివన్ భార్గవ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా స్పామ్ కాల్స్ కారణంగా ఏడాదిలో 3 బిలియన్ డాలర్ల(రూ.25 వేలకోట్లు) విలువైన బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్–జులై మధ్య భారత్‌లో రూ.1,720 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సైబర్ మోసాలపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్‌సీఆర్‌పీ) రోజూ సుమారు 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దేశంలో 60 శాతం మంది మొబైల్ యూజర్లకు రోజులో కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 87 శాతం మంది అవాంచిత ఎస్‌ఎంఎస్‌లు అందుకుంటున్నారు. స్పామ్ ముప్పునకు పరిష్కారం కోసం ఏడాదిగా శ్రమించి ఏఎస్‌టీని సొంతంగా అభివృద్ధి చేశాం. 100 మందికిపైగా డేటా సైంటిస్టులు నిమగ్నమయ్యారు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment