
గూగుల్ సంచలన అంచనా
2030 కల్లా ఏజీఐ
మానవాళిపై తీవ్ర ప్రభావం
మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమమేధ సాధించనుందని గూగుల్ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల్లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్ అనుబంధ డీప్‌మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్‌లెగ్ ఒక అంచనాకొచ్చారు. షేన్‌లెగ్ సహ రచయితగా సేవలందించిన ఒక విస్తృతస్థాయి నూతన పరిశోధన పత్రంలో సంబంధిత వివరాలున్నాయి. మానవాళికి కృత్రిమమేధ పెనుముప్పుగా పరిణమించనుందని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ఏజీఐతో వినాశనం
కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అంటారు. 2030 ఏడాదికల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనా పత్రం అంచనా వేసింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్న ఏజీఐ సృష్టించే పెనుమార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదముందని అభిప్రాయపడింది. ‘‘ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కల్గిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంతమేరకు కోలుకుని మనుగడ సాగించగలదనేవే ఇక్కడ ప్రధానం’’ అని పరిశోధన పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కిచెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమమేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు ఉమ్మడి పరిష్కారం కనిపెట్టాలని సూచించారు.
అంతా అస్తవ్యస్తం
అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చు. డేటాను తమకు అనుకూలంగా మార్చేయొచ్చు. దురి్వనియోగం చేయొచ్చు. తప్పులతడకగా డేటాలో మార్పులు చేయొచ్చు. డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దురి్వనియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధన పత్రం ప్రస్తావించింది. ‘‘వచ్చే పదేళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావొచ్చు. అది మానవమేధను మించిపోవచ్చు.
అప్పుడది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలనే ఇవ్వొచ్చు’’ అని డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఏజీఐలను సహేతుకతతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావులేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిïÙగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ‘‘ఏజీఐ అత్యంత సురక్షిత వ్యవస్థగా మాత్రమే ఉండేలా, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏజీఐల కోసం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయనే దానిపై నిఘా ఉండాలి. మానవాళికి సురక్షితం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న వంటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని డెమిస్ గతంలో అన్నారు.
ఏమిటీ ఏజీఐ?
కృత్రిమమేధ (ఏఐ) మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనమిచ్చిన పనులు, టాస్క్‌లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకుమించి సొంతంగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమేమున్నాయి వంటివాటిని స్వీయసమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు.
తుది ఫలితం పొందడం కోసం మనం ఏజీఐకు ఏదైనా సమాచారమిస్తే అది డేటాను అర్థంచేసుకుని, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని, తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలుపెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవమేధను ఔపోసన పట్టే ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్