6జీ రేసులో భారత్‌ | India advances in 6G race, ranks among top six in global patent filings | Sakshi
Sakshi News home page

6జీ రేసులో భారత్‌

Published Tue, Oct 15 2024 6:37 AM | Last Updated on Tue, Oct 15 2024 7:56 AM

India advances in 6G race, ranks among top six in global patent filings

భారీగా పేటెంట్ల దాఖలు 

అంతర్జాతీయంగా నాలుగో స్థానం 

న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను అందిపుచ్చుకునే దిశగా భారత్‌ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ బాటలో 6జీ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే గణనీయంగా పేటెంట్లు దాఖలు చేసింది. ఈ విషయంలో వివిధ అధ్యయనాల ప్రకారం భారత్‌ నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది. బ్రిటన్‌కి చెందిన యూ స్విచ్‌ ప్లాట్‌ఫాం ప్రకారం గతేడాది ఏప్రిల్‌ నాటికి 265 పేటెంట్లతో (6జీ) భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. చైనా (4,604), అమెరికా (2,229), దక్షిణ కొరియా (760) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. 

ఇక గ్లోబల్‌ ఐపీ మేనేజ్‌మెంట్‌ సంస్థ మ్యాక్స్‌వాల్‌ ప్రకారం 188 పేటెంట్లతో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. (ప్రభుత్వ డేటా ప్రకారం ఈ సంఖ్య ఈ ఏడాది 200 దాటేసింది). ఈ విషయంలో బ్రిటన్‌ (151), జర్మనీ (84), స్వీడన్‌ (74), ఫ్రాన్స్‌ (73) కన్నా ముందుండటం గమనార్హం. 6,001 పేటెంట్లతో  చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (3,909), దక్షిణ కొరియా (1,417), జపాన్‌ (584), యూరోపియన్‌ యూనియన్‌ (214) వరుసగా టాప్‌ 5 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్‌ ప్రధానంగా బ్లాక్‌చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ), 6జీ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎనర్జీ హార్వెస్టింగ్, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల్లో ఎక్కువగా పేటెంట్లు దాఖలు చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన ఐపీ సొల్యూషన్స్‌ సంస్థ క్వెస్టెల్‌ తెలిపింది.  

10 శాతం వాటా లక్ష్యం.. 
6జీ సాంకేతికతకు సంబంధించి భారత్‌ భారీ లక్ష్యాలనే పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయంగా 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా భారత్‌ 6జీ అలయెన్స్‌ ఆవిష్కరణ, 6జీ ట్రయల్స్‌ కోసం టెస్ట్‌ బెడ్స్‌ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంది. పేటెంట్ల దాఖలుకే పరిమితం కాకుండా 6జీ ప్రమాణాలను ప్రభావితం చేసే దిశగా కూడా భారత్‌ కృషి చేస్తోంది. 

160 పైగా దేశాల ప్రమాణాల సంస్థలకు సభ్యత్వం ఉన్న ఐఎస్‌వోలోని (ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌) టెక్నికల్‌ కమిటీలు, సబ్‌కమిటీల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్‌ 15 నుండి 24 వరకు భారత్‌లో వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్‌ఏ) జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 6జీ, ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటాలాంటి కీలక టెక్నాలజీల భవిష్యత్‌ ప్రమాణాల గురించి చర్చించేందుకు 190 పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement