బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.
‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og
— India in the UK (@HCI_London) August 6, 2024
కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‍లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment